కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న మరో 10 మందిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరి పేర్లుః భువనేశ్వర్‌, శ్రీకాకుళం. వీరు విశాఖ వాసులుగా గుర్తించారు. 


కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కు పోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి అయ్యన్న పాత్రుడు  ఆదేశించారు. బస్సు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ బస్సులో డిక్కీలో సైతం ఓ వ్యక్తి ప్రయాణిస్తుండటం గమనార్హం. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.



బస్సు పూర్తిగా నిండిపోవడంతో అతన్ని డిక్కీలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డిక్కీలోని వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. అతన్ని విశాఖవాసిగా గుర్తించారు. డిక్కీలో ప్రయాణికుడు ఉన్న ఘటనపై మరో కేసును నమోదు చేయనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: