తెలంగాణ సీఎం కే చంద్ర‌శేఖ‌ర్ రావు గ‌త రెండు నెల‌లుగా ప్ర‌క‌టించిన వ‌రాలు విలువ తెలిస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. దేశంలోనే మిగులు బ‌డ్జెట్ గా పేరు సంపాధించు కున్న తెలంగాణ స‌ర్కార్,  ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న సైతం అదే రీతిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతున్న త‌రుణంలో కేసీఆర్ అడిగిన‌వారికి వ‌రాలు కురిపిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్‌ఏల వేతనాలను భారీగా పెంచింది. వివిధ వర్గాలకు భారీ ప్రయోజనాలు కల్పించే కార్యక్ర మాలను ప్రకటించింది. రెండు లక్షల గొర్రెల యూనిట్లు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకం, నవజాత శిశువులకు కేసీఆర్‌ కిట్లు, అంగన్‌వాడీలకు సన్నబియ్యం వంటి కార్యక్రమాలు ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 


ప్రగతిభవన్‌లో జనహిత వేదికగా వరుసగా వివిధ వర్గాలతో సమావేశమైన సీఎం కొత్త హామీలకు ఎక్కువ ప్రాధాన్య మిచ్చారు. బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకంలో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల బ్యాంకు బకాయిలను కూడా రద్దు చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన వ రాల ఖరీదెంత? ప్రభుత్వ ఖజానాపై ఆర్థికంగా ఎంత అదనపు భారం పడుతుంది? ఆర్థిక శాఖ ఈ మేరకు లెక్క లేసుకుంటోంది. ఇప్పటికే వచ్చిన అంచనా ప్రకారం ఈ వరాల పద్దు రూ.10,565 కోట్లకు చేరుతోంది.

గొర్రెల పెంపకానికి రాబోయే రెండేళ్లలో రూ.5 వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 శాతం సబ్సిడీతో 2 లక్షల యూనిట్ల పంపిణీని లక్ష్యంగా ఎంచుకుంది. 21 గొర్రెలుండే ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షల అంచనా ఖర్చుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో కొత్త వరాల్లో ఇదే పెద్ద వాటాను ఆక్రమించనుంది. అలాగే నిరుటి తరహాలోనే చేపల పెంపకానికి నిధులు ఖర్చు చేయనుంది. వీటితోపాటు ఎంబీసీ వర్గాల చేయూ తకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కొత్త కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో 31 శాతం కాన్పులు.. అంటే ఇంచుమించుగా 2 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల సాయం, పుట్టిన పిల్లలకు అవసరమైన బేబీ సోప్స్, షాంపూలు, మందులుండే రూ.2 వేల విలువైన కిట్‌ను అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆడపిల్ల పుడితే మరో రూ.1,000 అదనంగా సాయం అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6,000 ప్రోత్సాహకంగా అందించనుంది. దీనికి రెండితల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటంతో దీనికి దాదాపు రూ.300 కోట్లు అవసరమవుతాయని ఆర్థిఖ శాఖ లెక్కలేసింది.

వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.313 కోట్ల భారం పడనుంది. తాజాగా వీఆర్‌ఏల వేతనాన్ని భారీగా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.4,700 చొప్పున రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్‌ఏలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.109 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో ఉన్న 35,700 మంది అంగన్‌వాడీ టీచర్లకు జీతాలను పెంచారు. ఒక్కొక్కరికి రూ.3,500 చొప్పున జీతం పెంచటంతో.. ఏడాదికి రూ.150 కోట్ల భారం పడనుంది. అలాగే అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.1500 చొప్పున జీతం పెరగనుంది. దీంతో జీతాల పద్దు రూ.54 కోట్ల మేర పెరగనుంది.

ప్రభుత్వ పక్కా ఇళ్లు పొందిన లబ్ధిదారుల గృహ రుణ బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించారు. 1983 నుంచి 2014 వరకు ఉన్న రూ.3,920 కోట్ల రుణభారాన్ని తొలగించాలని నిర్ణయించారు. రుణాల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలను నెల రోజుల్లోనే తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త బడ్జెట్‌లో గృహ రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

రేషన్‌ షాపులు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బియ్యం సబ్సిడీకి ప్రభు త్వం ఏటా రూ.2 వేల కోట్లు వెచ్చిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్రం 3,200 టన్నుల బియ్యం కేటాయి స్తోంది. కిలో రూ.30.50 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ మినహాయిస్తే మిగిలిన రేటును రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. దీంతో బియ్యం సబ్సిడీ భారం మరో రూ.100 కోట్లు పెరుగుతుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: