అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే కాదు.. ఆయన సహాయకులు, పాలక వర్గం కూడా కాసింత వివాదాలకు తావిచ్చే మనుషులేనని మరోసారి స్పష్టమైంది.  నిండు సభలో ట్రంప్ ‌సీనియర్ సలహాదారు కెల్యన్ కాన్వే తీరుతో అందరికీ చిర్రెత్తుకొచ్చింది. అమర్యాదకరమైన ఆమె ధోరణి సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యాయి. పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి విద్యావేత్తలు, మేధావులు ట్రంప్‌ను కలవడానికి వైట్ ‌హౌస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ వారితో కలిసి ఫొటో దిగడానికి సిద్ధమయ్యారు.


వైట్‌హౌస్‌లో సభ్యత మరిచిన ట్రంప్‌ సహాయిని

శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించపోయినా ఓ ఫొటో గ్రాఫర్‌ క్లిక్‌మనిపించారు. ఇప్పుడది బయటకు రావడంతో ఆమెపై ట్విట్టర్‌లో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్‌ హౌస్‌ అంటే కనీసం మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా మోకరిల్లి కూర్చోవడంపై మండిపడుతున్నారు.



 ఆఫ్రికన్ అమెరికన్ విద్యావేత్తలపట్ల కాన్వేకు కనీస గౌరవ మర్యాదలు లేవని ఒకరు, ఇది ‘తెల్ల హక్కు’ అని మరొకరు ట్వీట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ఈ ఫొటోలో ఎంతోమంది ఉన్నతశ్రేణి నల్లజాతీయులు నిల్చొని ఉండి ట్రంప్‌తో ఫొటో దిగుతున్న సమయంలో కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చోవడంపై మండిపడుతున్నారు. వేలల్లో కాన్‌ వే చర్యపై ట్విట్టర్‌లో ట్వీట్లు పేలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: