తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. 


ఇక ఆయ‌న మ‌హిళ‌ల కోసం తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు ఇంతా అంతాకాదు. స్వ‌శ‌క్తితో మ‌హిళలు ఏద‌గాల‌ని భావించిన ఆయ‌న వారి కోసం ప్ర‌త్యేక మైన ప‌థ‌కాలు, చ‌ట్టాలు రూపొందించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఆడవారి ఆర్థిక, సామాజిక స్వాతంత్య్రం గురించి మాట్లాడడం సహజం. ఆ పని ఆచరణలో చేసి చూపిన అరుదైన వ్యక్తుల్లో స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు(ఎన్టీఆర్‌) ఒకరు. దేశంలోనే తొలిసారిగా ఆస్తిలో మహిళలకు సమాన హక్కు చట్టపరంగా కల్పించింది ఆయనే. రాజకీయాల్లో, ఉద్యోగాల్లో ఆడవారికంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు చేసిందీ ఆయనే. 

దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం) పె ట్టిందీ ఎన్టీయారే. రక్త సంబంధం సినిమా రోజుల మొదలు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆడపడుచులకు అన్న గా వ్యవహరించిన ఎన్టీయార్‌ కోడళ్ళను కూడా కన్న కూతుళ్ళ లాగా చూసిన ఒక సంఘటన గురించి చెప్పుకో వాలి. చాలామందికి తెలీని ఆ సంగతి ఏమిటంటే... అది 1978 నాటి సంగతి. అప్పటికి ఎన్టీయార్‌ కుమారుల్లో నలుగురికి పెళ్ళయింది. 

ఆ నలుగురు కోడళ్ళకు (పద్మజాదేవీ జయకృష్ణ, మాధవీమణీ సాయికృష్ణ, లక్ష్మీ హరికృష్ణ, శాంతీ మోహన్ కృష్ణ) ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక సినిమా చేశారు. ఆ నలుగురు కోడళ్ళనే యజమానులుగా పెట్టి, ‘శ్రీతారకరామా ఫిలిమ్‌ యూనిట్‌’ స్థాపించి అప్పుడాయన నిర్మించిన సినిమాయే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీయార్‌, జయసుధ నటించిన ‘డ్రైౖవర్‌ రాముడు’. ఆ చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని కుమారుడు హరికృష్ణకు అప్పగించారు. 

అలా కోడళ్ళ కోసం ప్రత్యేకంగా సినిమా చేసిన ఘనత ఎన్టీయార్‌కు దక్కింది. ఏమని వర్ణించనూ... అంటూ కళ్ళు లేని చెల్లెలితో అన్న అనుబంధాన్ని తెలిపే సెంటిమెంట్‌ పాట, సీన్లు ఎన్నో ఉన్న ఆ సినిమా 1979 ఫిబ్రవరి 2న రిలీజై, కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా మీద వచ్చిన లాభాలతోనే అప్పట్లో ఎన్టీయార్‌ హైదరాబాద్‌లోని మసాబ్‌ ట్యాంక్‌ వద్ద చిన్న కొండ పై భాగం కొని, నలుగురు కొడుకులకీ ఇళ్ళు కట్టించి, కోడళ్ళ పేరు మీదే వాటిని పెట్టారు.

ఇప్పటికీ హీరో కల్యాణ్‌ రామ్‌ (తన తండ్రి హరికృష్ణతో పాటు) సహా ఎన్టీయార్‌ వారసులు ఆ ఇళ్ళలోనే నివసిస్తు న్నారు. గమ్మత్తేమిటంటే, ముందు చూపుతో కోడళ్ళ ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎన్టీయార్‌ చేసిన ఆ పని ఇవాళ వందల కోట్ల విలువైంది. కొందరి అంచనా ప్రకారం ఇప్పుడు ఆ ఇళ్ళ మార్కెట్‌ విలువ రూ. 150 కోట్ల పై మాటే. ఇంకా చెప్పాలంటే... ఆనాటి ‘డ్రైౖవర్‌ రాముడు’ (1979) సినిమా లాభం... తెలుగులో ఇప్పటి ‘బాహుబలి’ (2015) మొత్తం నికర వసూళ్ళతో (షేర్‌ కలెక్షన్లతో) సమానం కావడం విశేషం. ఇలా ఆయ‌న త‌న కుటుంబంలోని మ‌హిళ‌ల‌కు సైతం జీవితాంతం మ‌ర్చిపోలేని మంచి మంచి ప‌నులు చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆ స్పూర్తి నేడు రాజ‌కీయాల్లో ఉన్న నేత‌లు అందిపుచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: