తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశం నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొద‌ట‌గా గ‌వ‌ర్న‌ర్ ఈఎ స్ఎల్ న‌ర‌సింహ‌న్ ఉభ‌య స‌భ‌ల స‌భ్యుల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉద‌యం 9.50 నిమిషాల‌కు అసెంబ్లీ కి చేరుకుని అసెంబ్లీ లో ప్ర‌సంగించిన అనంత‌రం తెలంగాణ కౌన్సిల్ లో స‌భ్యుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించను న్నారు. రాష్ట్ర సంక్షేమ  కార్య‌క్ర‌మాలు, రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సుమారు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వ‌ర‌కు ఉండొచ్చున‌ని అధికారుల అంచ‌నాలు వేస్తున్నారు.


అయితే గ‌తంలా ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో జీరో అవర్ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ప్రశ్నోత్త రాల సమయం ముగిసిన తర్వాత టీ బ్రేక్ ఇచ్చి, అనంతరం నేరుగా చర్చను చేపట్టే అవకాశాలుంటాయని తెలుస్తున్నది. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నేది బీఏసీ స‌మావేశాల్లో ఖ‌రార‌వుతుంది. ఈ నెల 11 రెండో శ‌నివారం కూడా స‌మావేశాలు కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి. ఆదివారం హోలీ, సెల‌వుదినం కావ‌డంతో 13న ఉభ‌య స‌భ‌ల్లో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

గవర్నర్ ప్రసంగం అనంతరం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో శాసనసభ బిజి నెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానున్నది. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు సభానాయకుడైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, లెజిస్లేటివ్ వ్యవహా రాల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌లు, ప్రతిపక్ష నేత కే జానారెడ్డి, కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క, జీ చిన్నారెడ్డి, మిగతా పార్టీల శాసనసభా పక్ష నేతలు పాల్గొననున్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో పాటు వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కు కేటాయించే నిధుల పద్దులను ప్రకటించనుంది. మరోవైపు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మ‌రోవైపు అధికార పార్టీ సైతం ప్ర‌తి ప‌క్ష పార్టీల‌ను వ్యూహాల‌ను తిప్పి కొట్టేందుకు స‌న్నద్దమ‌వుతున్నారు. అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. పూర్తిస్థాయి అవగాహనతో సభకు రావాలని తెలిపారు.

ప్రభుత్వం చర్చకు ఎప్పుడూ సిద్ధమేనని అంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో 17 రోజులు 17 అంశాలపై చర్చిం చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నది కనుకనే ఏ అంశంపై అయినా ముందుకు వస్తున్నదని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకొనిపోతున్నదని, ఈ సంవత్సరం 19.5 శాతం వృద్ధి రేటు సాధించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రమూ ఇంత అభివృద్ధి నమోదు చేయలే దని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యపడిందని అన్నారు. సభలో విపక్ష సభ్యులెవరైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే, ఆధారాలు చూపించాలని డిమాండ్ చేయాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: