తెలుగునాట సీనియర్ జర్నలిస్టుల్లో ఒకరైన కొమ్మినేని శ్రీనివాసరావు.. నిన్న మొన్నటి వరకూ ఎన్టీవీలో ఎడిటర్ గా పనిచేశారు. అక్కడి నుంచి చంద్రబాబు టీమ్ ఒత్తిళ్ల మేరకు వైదొలగాల్సి వచ్చింది. ఇటీవల ఆయన సాక్షి మీడియాలో చేరిన సంగతి తెలిసిందే. ఇక సాక్షిలో చేరిన తర్వాత జగన్ ను సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు. కాకపోతే సపోర్ట్ చేసేందుకు లాజిక్ ఉంటే బావుంటుంది కదా.



భూమా నాగిరెడ్డి మరణం, అంత్యక్రియలు, అసెంబ్లీలో సంతాప తీర్మానం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని.. అఖిలప్రియను అంత్యక్రియలు ముగిసీ ముగియగానే అసెంబ్లీకి రప్పించారని.. అంత్యక్రియలకు హాజరు కాని జగన్ ను.. సంతాప తీర్మానానికి హాజరుకాని వైసీపీ తీరును కావాలనే అసెంబ్లీలో తిట్టించారని కొమ్మినేని తన తాజా వ్యాసంలో రాసుకొచ్చారు. 


మొత్తం వ్యాసంలో మరణించిన తర్వాత భూమాకు సభలో అగౌరవం కలగరాదని జగన్ భావించి మానవత్వంతో వ్యవహరించారని కొమ్మినేని రాసుకొచ్చారు. రెండు పక్షాల వాదన విన్న తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఈ సంతాప తీర్మాన సమయంలో సభలో లేకపోవడమే సరైన నిర్ణయం అని కొమ్మినేని తీర్పు చెప్పారు.  రాజకీయాలలో ప్రతి సందర్భంలోను మంచి, చెడుతో నిమిత్తం లేకుండా చంద్రబాబు రాజకీయం చేస్తారని విమర్శించారు. 


ఐతే.. తన పార్టీలో కీలక నేతగా చాలాకాలం పని చేసిన భూమానాగిరెడ్డి చనిపోతే ఆయన పార్థివదేహాన్ని సందర్శించకపోవడం జగన్ చేసిన తప్పిదం కాదా.. జగన్ భూమా అంత్యక్రియలకు హాజరైతే బావుండేది. అలాగే సంతాప తీర్మానానికి హాజరై.. భూమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. చివర్లో చంద్రబాబు తీరునూ తప్పుబట్టి ఉండాల్సింది. కానీ కొమ్మినేని తన వ్యాసంలో ఆసాంతం జగన్ ను వెనకేసుకొచ్చినట్టే రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఏ గూటి చిలక ఆ పాటే పాడుతుందన్న సామెతను రుజువు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: