దేశాన్ని కంటి చూపుతో శాసించిన కాంగ్రెస్ పార్టీకి  ఈ దుస్ధితి రావడం స్వయం కృతాపరాధమేనా ? అస్ధిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్ధితులు రావడం ఒక్కరోజులో జరిగింది కాదంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఏక పక్ష నిర్ణయాలు, నియంతృత్వ విధానాలు, ఒంటెద్దు పోకడలు, అధికార దుర్వినియోగం, స్వార్ధ ప్రయోజనాలకు వ్యవస్ధలకు వాడుకోవడం వల్ల  ..   తన పతనాన్ని తానే  శాసించుకుందని విశ్లేషిస్తున్నారు. ప్రజా సంక్షేమం కంటే చుట్టూ ఉన్న కోటరీకే అధిక ప్రాధన్యతనివ్వడం వల్ల ప్రజా నాయకులు దూరమై.. రాజకీయ నిరుద్యోగులు దగ్గర కావడం కూడా పార్టీకి శాపంగా మారిందని భావిస్తున్నారు.  


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది కాదనలేదని సత్యం. అందుకే మిత్రులను పార్టీకి బలంగా ..శత్రువులను  శాపంగా చూస్తారు. అలాంటి బలమైన మిత్రులను  శత్రువులుగా  ఎలా తయారు చేసుకోవాలో ... అందులోనూ దశాబ్దాలుగా నమ్మి ఉన్న వారిని శత్రువులుగా ఎలా మార్చుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతా మారే పార్టీకి తెలియనదనే అనుకోవాలి. అందుకే గడచిన ఆరేళ్లలో కీలకమైన మిత్రపక్షాలు అన్ని దూరం కాగా..  ఐదు మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు పార్టీని విడిచి వెళ్లిపోయారు. వీరంతా  కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిషలు పాటు పడిన మాజీ ముఖ్యమంత్రుల వారసులు. కాని వీరు ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే మండి పడుతున్నారు.  సై అంటే సై అంటూ కయ్యానికి దిగుతున్నారు. సొంత కుంపట్లతో ఒకరు ... ప్రత్యర్ధి పార్టీలో మరొకరు చేరి అధినాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పతనమే లక్ష్యంగా పావులు కదుపుతూ ... తమ సత్తా చాటుతున్నారు.  


దేశంలో కాంగ్రెస్కు బలమైన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. నాటి ఇందిర నుంచి నిన్నటి యూపీఏ-2 వరకు ఏపీనే  అత్యంత కీలకం.  2009 ఎన్నికల్లో 33 సీట్లను ఇక్కడి ఓటర్లు అందించారు. అయితే 2009 జమిలి ఎన్నికల తరువాత సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ రాజశేఖరెడ్డి..  సెప్టెంబర్ 2 వ తేదిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు.  అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...తన తండ్రి మృతిని తట్టుకోలేకపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు.  దీనిపై ఆంక్షలు విధించిన కాంగ్రెస్ అధిష్టానం.. యాత్రను విరమించుకోవాలంటూ జగన్ను కోరింది. ఇందుకు జగన్ నిరాకరించడంతో  ఇద్దరి మధ్య క్లాష్ ప్రారంభమైంది. దీంతో 2010 నవంబర్ 29న కాంగ్రెస్ను వీడి తండ్రి పేరుతో సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. రాజీనామా సందర్భంగా సోనియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన 2014 ఎన్నికల్లో తన సత్తా ఏంటో చాటారు. తాను అధికారంలోకి రాలేకపోయినా .. కాంగ్రెస్ ఓటుబ్యాంకును కొల్లగొట్టారు.  మొత్తం 175 ఎమ్మెల్యే, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క చోటు మినహా ఎక్కడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.  


2011లో అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్న దోర్జి ఖండూ ఏప్రిల్ 30వ తేదిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. అనంతరం ఆయన కుమారుడు ఫెమా ఖండూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న అధిష్టానం ఐదేళ్ల పాటు సాగ తీసింది. తీరా పదవి ఇచ్చిన తరువాత పొమ్మన లేక పొగబెడుతోందని ఆరోపిస్తూ.. తనతో పాటు మిగిలిన 42 ఎమ్మెల్యేలను తీసుకుని తొలుత పీపుల్స్ ఫార్టీలో తరువాత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రి ప్రాణత్యాగాన్ని కాంగ్రెస్ గుర్తించకుండా తనపైనే దాడికి పాల్పడిదంటూ ఆరోపించారు.  


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఉత్తరప్రదేశ్ పీసీసీ చీఫ్ రీటా బహుగుణ కూడా ఒకరు. యూపీ మాజీ ముఖ్యమంత్రి హేమ్వాతి నందన్ బహుగుణ కుమార్తె అయినట్టు రీటా.. దశాబ్దాల తరబడి నుంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా కాంగ్రెస్ ఉన్నతికి పాటుపడ్డారు.అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమను పార్టీ నిర్లక్ష్యం చేసిందని ....రాహుల్ తనను తీవ్రంగా అవమానపర్చాడని ఆరోపించిన ఆమె .. లక్నో నుంచి ఎన్నికల బరిలో దిగి మూలయం చిన్న కోడలు అపర్ణ యాదవ్పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం మంత్రి పదవి కూడా దక్కించుకుని తగిన గుర్తింపు పొందారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఉంటూ కార్యకర్తలకు దగ్గరైన రీటా.. ఒక్కసారిగా పార్టీని వీడటం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్లు దక్కకపోవడానికి ఇదే కారణమైంది.  


ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో రోజునే కాంగ్రెస్కు షాకిచ్చారు ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, గోవా ఎమ్మెల్యే  విశ్వజిత్ రాణె. హైకమాండ్ తీరును నిరసిస్తూ  ..అత్యధిక సీట్లు సాధించినా ...  అధిష్టానం నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామంటూ ఆరోపిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గోవా అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు  హాజరుకాని ఆయన..  త్వరలోనే బీజేపీలో చేరబొతున్నట్టు భావిస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన రాణే.. పార్టీకి దూరం కావడం శుభపరిణామం కాదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో రాణేతో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలు  ఆయనతో పాటు వెళ్లే అవకాశాలుండటంతో కాంగ్రెస్ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.  


పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెను వీడిన వారిలో సీనియర్ నేత గుర్కన్వాల్ కౌర్ ఒకరు.  బాంబు దాడిలో ప్రాణాలు కోల్పయిన  పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తె అయిన కౌర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గతంలో అమరీందర్ సింగ్ కేబినెట్లో  మంత్రిగా  విధులు నిర్వహించిన ఆమె.. ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ను వీడి కమలానికి చేరువయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాకపోయినా భవిష్యత్లో దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని కాంగ్రెస్ నేతలే కల్పించారు. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్వయంకృతపరాధమే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ప్రజామోదం లేని ఏక పక్ష నిర్ణయాలతో  అటు నాయకులు ఇటు క్యాడర్ దూరమవుతోందని చెబతున్నారు.  ఇప్పటికైనా వెళ్లిపోయిన నాయకుల గురించి కాకుండా ఉన్న వారి గురించి ఆలోచించాలంటూ సలహా ఇస్తున్నారు.      

నాయకులను ఈ రకంగా దూరం చేసుకున్న కాంగ్రెస్ తనతో కలిసి వచ్చే మిత్రపక్షాలపై అధికార దర్పం ప్రదర్శించి చేజేతులా  వైరి పక్షాలుగా మార్చుకుంది. యూపీఏలో నమ్మకంగా ఉంటూ వచ్చిన డీఎంకే .. మద్దతు ఉపసంహరిస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే  .... సీబీఐని ప్రయోగించడం ద్వారా తాను కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు చెప్పకనే చెప్పింది.  దీంతో పాటు ఏపీలో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కూడా ఇదే తరహాలో దాడులు జరిపి.. కీలకమైన సామాజిక వర్గాన్ని ఇరు రాష్ట్రాల్లో దూరం చేసుకుంది. దీంతో కీలకమైన సమయాల్లో మిత్రపక్షాల అండ లభించని పరిస్ధితి నెలకొంది.  కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఇటీవల కాలంలో కేంద్రం పలు బిల్లులను రాజ్యసభలో బలం లేకపోయినా సులువుగా ఆమోదించుకోగలిగింది. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా నడవకపోవడమే ప్రస్తుత పరిస్ధితులకు కారణమంటున్నారు విశ్లేషకులు.  క్షేత్రస్ధాయి అభిప్రాయానికి విలువనివ్వకుండా  ఒంటెద్దు పోకడలు ప్రదర్శించడం వల్లే వరుస పరాజయాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలతో దూరమవుతున్న వారిని బీజేపీ అక్కున చేర్చుకోవడం వల్ల పార్టీకి దూరమయ్యే వారి సంఖ్య పెరుగుతోందని ..ఈ వాస్తవం గుర్తించి ఇకనైనా తీరు మార్చుకోవాలని అధిష్టానికి సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: