సూర్య అంటే పేరు కాదు... సూర్య అంటే ఓ బ్రాండ్.. ఇదీ బిజినెస్ మేన్ సినిమాలో మహేశ్ బాబు డైలాగ్.. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది.. సీఎం చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి కాదు.. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని ప్రచారం సాగిస్తున్నాయి అధికార పార్టీ వర్గాలు. తాజాగా ఆయన కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చే చేరింది. 


అదే లిమ్కా బుక్ రికార్డ్.. అవును.. చంద్రబాబు సర్కారు పట్టుపట్టి మరీ పట్టుదలగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అతి తక్కువ కాలంలో గోదావరి, కృష్ణ నదుల అనుసంధానాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. కేవలం 173 రోజులలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంగొప్ప విశేషంగా లిమ్కాబుక్‌ గుర్తించింది. 


2015 మార్చి 30వతేదీన ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2016 మార్చి 29లోగా హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ద్వారా చేపట్టడాన్ని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ప్రస్తావించింది. అనుకున్న బడ్జెట్‌ కంటే ఎలాంటి పెంపూ లేకుండా ప్రాజెక్టు పూర్తి చేయడం గొప్ప విశేషంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అభివర్ణించింది. ఈ మేరకు ఒక పత్రాన్ని అందించింది. 


ఇప్పుడీ లిమ్కా బుక్ రికార్డును ప్రమోట్ చేసుకునే పనిలో టీడీపీ వర్గాలు ఫుట్ బిజీగా ఉన్నాయి. శనివారం అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులు ఈ లిమ్కా బుక్ రికార్డును ప్రస్తావించి చంద్రబాబు గొప్పదనాన్ని ఆకాశానికి ఎత్తేశారు. పట్టిసీమకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ఆదాయం పంటలు కాపాడుకోవడం ద్వారా వచ్చిందని చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: