ఏపీ శాసనసభ భవన ప్రాంగణంలో అమరావతి రాజధానిలోని కీలకమైన పరిపాలనా నగరం కొత్త డిజైన్లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డిజైన్లు రూపొందించిన సంస్థ ప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్, మండలి చైర్మన్ల ప్రత్యేక అనుమతితో ఈ షో రూపొందించారు. 


అమరావతి నిర్మాణంలో కీలకమైన ప్రధాన ఆర్కిటెక్టు పరిపాలనా నగరానికి సంబంధించిన డిజైన్లను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఇప్పుడు విమర్శల పాలవుతోంది. ప్రతిపక్ష వైసీపీతో పాటు మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలన మూడేళ్లు అయినా ఏపీ రాజధాని నిర్మాణానికి ఇటుక కూడా పెట్టలేదని ప్రతిపక్ష నేత జగన్‌ విమర్శించారు. 


రాజధాని డిజైన్లను అసెంబ్లీలో ప్రదర్శించిన సమయంలో దీన్ని వీక్షించేందుకు  వైఎస్‌ జగన్‌ హాజరు కాలేదు. దీనిపై కారణాలను అడిగిన మీడియా ప్రతినిధులతో  వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజంటేషన్‌తో గంట సమయం వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. 


రాజధాని అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. దేశంలో కొత్తగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అవన్నీ ఇంత హంగామా చేశాయా అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే కట్టిందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హడావుడి చేస్తోందని ఆయన విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: