ఈ రోజు రాత్రి 9 గంటలకు భారతీయులందరూ గర్వించదగ్గ ప్రోగ్రామ్ టీవిలో రాబోతుంది.  అవునండీ..నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం ప్రపంచవ్యాప్తం కానుంది. తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ పేరుతో  డాక్యుమెంటరీ ఈనెల 27న రాత్రి 9 గంటలకు  ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని ఎన్జీసీ కి చెందిన ఆరుగురు సభ్యుల బృందం అద్భుతంగా చిత్రీకరించారు.

ప్రకృతి.. ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం.. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం.. భక్తబృందాల గోవింద నామాల ప్రతిధ్వని.. వేలు, లక్షల సంఖ్యలో ఆ స్వామిని దర్శించుకోవడానికి వెల్లువెత్తే భక్తులు.. కొండమీదే కొన్ని రోజులు ఉండిపోయి మరీ శ్రీనివాసుడి సేవలో తరించే శ్రీవారి సేవకులు.. నిత్యం ఉచితంగా వేలాది మంది ఆకలి తీర్చే అన్నసత్రాలు.. బ్రహ్మోత్సవ వైభవాలు, నిత్యసేవలు, అలంకార వైభోగాలు... ఇలా ప్రతి దాన్నీ అద్భుతంగా తెరకెక్కించారు.

ఒక్క తిరుమలేశుడి వైభవంపైనే.. తిరుమల ప్రాశస్త్యం పైనే 43 నిమిషాల డాక్యుమెంటరీ నిర్మించింది. తిరుమలలో ఎన్జీసీ బృందం చిత్రీకరించిన మిగతా అన్ని అంశాలూ ఒక ఎత్తైతే.. ఆ శ్రీవారి వైభవం మరొక ఎత్తు. ఆలయం వెలుపల జరిగే ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన నాలుగు రోజుల వాహన సేవలను ఎన్జీసీ చిత్రీకరించింది.

స్వామి వారి అలంకరణకు ఎన్ని రకాల పుష్పాలు వినియోగిస్తారు తదితరాలన్నీ పొందుపరిచారు. ఈ ప్రోమో చూసిన టీటీడీ అధికారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నిజంగా ఈ డాక్యుమెంటరీ అద్భుతంగా ఉందని, యాత్రికుల భక్తి పారవశ్యాన్ని, తిరుమల వైభవాన్ని ఎన్జీసీ నభూతో.. అన్న రీతిలో చిత్రీకరించిందని, శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోందని టీటీడీ అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: