జగన్‌కు సీబీఐ నుంచి ఊహించని షాక్!


వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సీబీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై విడుదలైన జగన్‌కు సీబీఐ ఝలక్ ఇచ్చింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేసింది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో వివరించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌ను ఆదేశించింది.

లీక్‌ కాదు, మాల్‌ ప్రాక్టీస్‌..

అసెంబ్లీ సాక్షిగా టెన్త్‌ సైన్స్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి ‘వాటర్‌ బాయ్‌, ఇన్విజిలేటర్‌, అటెండర్‌’  బాధ్యులు అయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. ఓ వైపు నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ....లీకేజీకి నారాయణ విద్యాసంస్థలకు సంబంధమే లేనట్లు .... ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్‌ చేసిన తర్వాత లీకేజీపై చర్చ చేయకుండానే చంద్రబాబు సభలో ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని, మాల్‌ ప్రాక్టీస్‌ అయినట్లు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా 'సాక్షి'ని ఇందులోకి లాగే యత్నం చేశారు.

అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తుంది


ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్నా సిగ్గేస్తోందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు.  బీజేఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, బీజేపీకి మరీ ఇంత చిన్న రూమా అంటూ ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ రూమ్‌ చూస్తే తనది చేతగానితనం అనే భావన...ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదన్నారు.  

రాజ్‌భవన్‌ ఉగాది వేడుక‌లు..


తెలుగువారి తొలి పండుగ ఉగాది వేడుకలు రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఉగాది వేడుకలకు విచ్చేస్తున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ వేడుకలను గవర్నర్‌ దంపతులు జ్యోతిప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన పలువురినీ ఆకట్టుకుంది.


108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

 తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్‌ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో  1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: