ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారిక నివాసం 5 కాళిదాస్‌ మార్గ్‌ పక్కన ఉండే బంగ్లాలో ఉండేందుకు మంత్రులు, అధికారులు హడలిపోతున్నారు. 6 కాళిదాస్‌ మార్గ్‌లో ఉన్న ఆ బంగ్లాలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ.. అక్కడ తమకు అననుకూల వాతావరణం, అశుభం కలుగుతుందనే భయమే ప్రధాన కారణమట. ఎందుకంటే, ఆ బంగ్లాలో అంతకుముందు నివసించిన వారు జైలు పాలో, అనారోగ్యం పాలవడమో జరిగిందట. దీంతో, ఆ బంగ్లాలో నివసించేందుకు ఏ ఒక్క మంత్రి గానీ, అధికారి గానీ ముందుకు రావట్లేదని తెలుస్తోంది.



 ఒకప్పుడు ఎస్పీ సీనియర్‌నేతగా ఉన్న అమర్‌సింగ్‌తో పాటు బాబు సింగ్‌ కుశ్వర్‌, వాకర్‌ అహ్మద్‌ షా, జావేద్‌ అబ్ది, నీరా యాదవ్‌, ప్రదీప్‌ శుక్లా తదితరులు గతంలో ఈ నివాసంలోనే ఉండి అనేక ఇబ్బందులు గురయ్యారు. అంతేకాకుండా, మాయావతి నాడు సీఎంగా ఉన్న సమయంలో ఆమెకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన బాబు సింగ్ కుశ్వర్ కూడా ఈ బంగ్లాలోనే నివాసం వుండేవారు. ఆయన ఓ కుంభకోణం కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. అమర్‌సింగ్‌తో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు సైతం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేసేశారు.


Image result for adityanath new cabinet

యూపీ మాజీ సీఎస్‌ నీరా యాదవ్‌, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డైరెక్టర్‌ ప్రదీప్‌ శుక్లాలను కూడా ఆ తర్వాత సీబీఐ జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఆ బంగ్లాలో నివాసం ఉంటే తమకు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని మంత్రులు, అధికారులైతే అందులోకి వెళ్లాలంటేనే గజగజ వణుకిపోతున్నారట. ఈ బంగ్లాను ఎవరూ తీసుకొనేందుకు ముందుకురాకపోవడంతో దీన్ని కూల్చివేయడమో.. లేదంటే 7 కాళిదాస్‌ మార్గ్‌లో ఉన్న డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌ మౌర్య నివాసంలో కలిపివేయడమో చేయాలని ఎస్టేట్‌ అధికారులు భావిస్తున్నారు. లేకపోతే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సెక్యూరిటీ క్యాంప్‌గా ఉపయోగించాలని యోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: