అఖిలప్రియ.. అనూహ్యంగా మంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదట్లో చిన్న పిల్ల.. పాలన ఏం చేస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ కొద్ది రోజుల్లోనే అఖిలప్రియ తన సత్తా ఏమిటో చూపిస్తోంది. తాను ఏమాత్రం సాఫ్ట్ కానని.. తనను తక్కువ చేయవద్దని అందరికీ పరోక్షంగా హెచ్చరికలు పంపింది. మొన్నటికి మొన్న కర్నూల్లో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో అధికారులను ఆమె నిలదీసిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


తాజాగా నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థి ప్రకటనలోనూ అఖిలప్రియ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. వాస్తవానికి నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు పెద్ద తలనొప్పిలా పరిణమించింది. ఓవైపు శిల్పామోహన్ రెడ్డి నంద్యాల ఉపఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నంద్యాల ఉప ఎన్నికలో పోటీచేస్తానని ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 


అంతేకాదు.. పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే వైసీపీలో వెళ్లిపోతామని శిల్పామోహన్ రెడ్డి ఖరాఖండీగానే తేల్చి చెప్పేస్తున్నారు. ఈ ఇష్యూ ఓవైపు చంద్రబాబు వద్ద నలుగుతున్న సమయంలోనే అఖిలప్రియ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నంద్యాల ఉపఎన్నిక టిక్కెట్ మాదే అని స్పష్టంగా ప్రకటించేసింది. తమ కుటుంబం నుంచే అభ్యర్థి నిలబడతారని కుండబద్దలు కొట్టింది. 

Image result for shilpa mohan reddy

అంతే కాదు.. ఈనెల్లోనే జరగునున్న శోభానాగిరెడ్డి సంస్మరణ కార్యక్రమంలో నంద్యాల ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పేసింది. ఇక ఈ విషయంలో తమ కుటుంబానిదే ఫైనల్ అన్నట్టుగా ఆమె ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే పదవిలో ఉండి మరణిస్తే.. పోటీ లేకుండా  ఆ కుటుంబానికే ఆ స్థానం కట్టబెట్టడం సంప్రదాయంగా వస్తోందని ఆమె గుర్తు చేసింది. ఓవైపు చంద్రబాబుతో శిల్పాసోదరుల భేటీ జరగుతున్నా అఖిలప్రియ మాత్రం తన వాదన వినిపించేసింది. విజయవాడలోనే ఉంటూ తన అనుమతి లేకుండానే అఖిలప్రియ ఏకపక్షంగా అలా ప్రకటించడం చంద్రబాబునే దిమ్మెరపోయేలా చేసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: