పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గీత దాటితే కేసు తప్పదని తెలుగు దేశం సర్కారు ఈ చర్య ద్వారా అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఇంటూరి రవికిరణ్ అరెస్టు వ్యవహారం ద్వారా వైసీపీ ని ఇరుకున పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి. 



మరోవైపు ఇంటూరి రవికిరణ్ వ్యవహారం అటు నేషనల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఎన్డీటీవీ వంటి ఛానళ్ల ద్వారా రవికిరణ్ అరెస్టు వ్యవహారం జాతీయ మీడియాకెక్కింది. గతంలో బాల్ థాకరే పై కార్టూన్లుపై సోషల్ మీడియాలో లైక్, షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకున్న ఉదంతాలను గుర్తు చూస్తూ ఈ వార్తను ప్రసారం చేశాయి. 


ఐతే.. ఇప్పుడు టీడీపీ సర్కారు చర్య పక్క రాష్ట్రంలోని కేసీఆర్ నూ కదిలించినట్టు కనిపిస్తోంది. ఆధారాలు లేకుండా ఎవరైనా విమర్శలు చేస్తే ఊరుకోబోమని తెలంగాణ ప్లీనరీ సాక్షిగా ఆయన ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చేశారు. కొంపల్లి లో జరిగిన ప్లీనరీ లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. కొందరు కావాలని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, వారిని నియంత్రించాలంటే చర్యలు చేపట్టాలని అన్నారు.



అందుకే ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం అని ఆయన హెచ్చరించారు.. విపక్షాలు గుడ్డి విమర్శలు మానుకోవాలని కేసీఆర్ సూచించారు. అవినీతిని పెంచి పోషించింది గత ప్రభుత్వాలేనని తేల్చిన కేసీఆర్.. తమకు తాము అవినీతిపై యుద్ధం చేస్తున్నామని ప్రకటించుకున్నారు. మొత్తానికి తమకు నచ్చని స్వరాలను విని భరించే ఓపిక అధికారపక్షాల్లో తగ్గిపోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: