అందివచ్చిన ఏ అవకాశాన్ని జార విడుచుకుకోకూడదు.. ప్రత్యర్థి బలాలను గుర్తించి వాటిని బలహీనం చేయాలి.. ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనివ్వకుండా దాడులు కొనసాగించేలా.. కోలుకునే అవకాశం ఏ దశలోనూ ఇవ్వకూడదు.. ఇవీ ప్రస్తుతం రాజకీయ చదరంగంలో చంద్రబాబు ప్రతిపక్షంపై అనుసరిస్తున్న వ్యూహం.. అందుకే ఏమాత్రం ఛాన్స్ దొరికినా చంద్రబాబు జగన్ ను వదలడం లేదు. 


జగన్ కు ఉన్న కొన్ని బలమైన అంశాల్లో సాక్షి మీడియా ఒకటి.. అందుకే సాక్షి మీడియాను ఇరుకున పెట్టే అంశాలపై టీడీపీ దృష్టి సారించింది. మొన్నటికి మొన్న స్పీకర్ పై సాక్షి మీడియా దుష్ప్రచారం చేసిందని ఏకంగా అసెంబ్లీలోనే ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఎండగట్టారు. సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలోనే తమ పార్టీ సభ్యులతో డిమాండ్ చేయించారు. 



అంతకుముందు.. రాజధాని భూములను మంత్రులు ఇష్టారాజ్యంగా బినామీ పేర్లతో కొనుగోలు చేశారని సాక్షిలో ఓ కథనం వచ్చింది. దానిపై మంత్రి నారాయణ పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆ కేసు విజయవాడ నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా తన వాదన వినిపించేందుకు మంత్రి నారాయణ న్యాయమూర్తి వద్దకు వచ్చారు.



సాక్షి పత్రిక తప్పుడు కథనం ప్రచురించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని మంత్రి నారాయణ న్యాయమూర్తి ముందు తన వాదన వినిపించారు. సాక్షి మీడియాలో వచ్చిన కథనంలో పేర్కొన్న వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి వాదన నమోదు చేసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను మే ఐదో తేదీకి వాయిదా వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: