ఆంధ్రకర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్‌గేట్‌ వద్ద సిబ్బంది టోల్‌ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు.‘నేను ఎంపీ కొడుకుని. నన్నే ఆపుతారా?.. ఉండండి మీ పని చెప్తా’’ అంటూ తన అనుచరులకు ఫోన్ చేసి పిలిపించాడు. తన అనుచరులతో కలిసి టోల్ రూమ్ అద్దాలను పగులగొట్టి, కంపూటర్లను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. అడ్డు చెప్పిన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. 



ఎంపీలకు మినహాయింపు ఉంటుంది కానీ.. వారి తనయులకు టోల్‌ ఫీజు విషయంలో మినహాయింపు ఉండదని సిబ్బంది చెప్పడమే కిష్టప్ప వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. బాగేపల్లి టోల్‌గేట్ సిబ్బందిపై దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ నిమ్మల కిష్టప్పకు సంబంధించిన వారే ఫీజు చెల్లించకుండా వాగ్వాదాలకు దిగిన దాఖలాలు ఉన్నాయి. ఆ టోల్ గేట్ ఏపీ-కర్ణాటక బార్డర్‌లో ఉండడంతో చాలా మంది ప్రజా ప్రతినిధులు బెంగళూరు వెళ్లేందుకు అటునుంచే వెళ్తారు.



ఈ నేపథ్యంలో చాలాసార్లు తమపై ప్రజా ప్రతినిధులు, వాళ్ల సంబంధితులు దాడులు చేశారని టోల్‌గేట్ సిబ్బంది వాపోతున్నారు. అయితే నిమ్మల అంబరీష్, టోల్ సిబ్బందిపై ఎదురు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం బాగేపల్లి పోలీస్ స్టేషనుకు వచ్చిన ఆయన, టోల్ సిబ్బంది తనపై దాడికి దిగి కొట్టారని, అందువల్లే తాను భయంతో సమీపంలోనే ఉన్న టీడీపీ కార్యకర్తల సహాయం కోరానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: