చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన భీకర దాడితో కేంద్రం, ఆ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ దాడిలో పాతిక మంది వరకూ జవాన్లు చనిపోయారు. మరో పది మంది వరకూ గల్లంతయ్యారు. ఈ దాడి ఘటన ఎలా జరిగిందని విశ్లేషించే పనిలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు. వారి అంచనాల ప్రకారం.. ఈ దాడిలో దాదాపు 300 మంది వరకూ నక్సల్స్ మూకుమ్మడిగా దాడి చేశారని తేలింది. 



నక్సల్స్ దాడిని సీఆర్ పీఎఫ్ జవాన్లు గుర్తించి ఎదురుదాడికి సన్నద్ధమయ్యేలోగానే జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది. అయినప్పటికీ శౌర్య ప్రతాపాలకు మారుపేరైన జవాన్లు ప్రతిఘటించి ఎదురుదాడి చేశాయి. వారి దాడిలో దాదాపు 10 మంది వరకూ మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో జరిగిన మవోయిస్టు దాడి వివరాలను ప్రధానమంత్రికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. 

Sukma Attack: 26 CRPF Personnel Dead In Encounter With Maoists

సుక్మా జిల్లా ఘటనకు దారితీసిన పరిస్థితులను మోడీకి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స గురించి కూడా మోడీకి చెప్పారు. ఈరోజు రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రాయ్‌పూర్‌ వెళ్తారు. ఈ దాడి విషయం తెలిసిన సమయంలో చత్తీస్ గఢ్ సీఎం ఢిల్లీలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన హుటాహుటిన చత్తీస్ గఢ్ వెళ్లిపోయారు. 



రాయ్‌పూర్‌లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను రమణ్ సింగ్ పరామర్శించారు. మావోయిస్టుల ఘాతుకంపై ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. నక్సల్‌ దాడిలో మరణించిన జవాన్ల భౌతికకాయాలు వారి స్వస్థలాలకు వీలైనంత త్వరగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఐతే ఈ ఘటన గురించి ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. జరిగిన ప్రాణ నష్టం గురించిన అంచనాలు మాత్రమే ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: