అధినేతలను ఆనందపర్చాలనే అత్యుత్సాహం కూడా అప్పుడప్పుడూ అక్షింతలు తెచ్చిపెడుతుంటుంది. జగన్‌ మోడీ భేటీ విషయంలో టిడిపి నేత యలమంచలి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ పరిస్థితి అలాగే తయారైంది. భేటీ వార్త తెలియగానే ఆయన మీడియాలో రెచ్చిపోయారు. ఒక 420 కి ప్రధాని మోడీ ఎలా అపాయింట్‌మెంట్‌ ఇస్తారని నిలదీశారు.ఇది చూసి తామెక్కడ వెనకబడిపోతామోనని వర్లరామయ్య, బోండా ఉమ వంటి వారు మరో రెండు ఎక్కువ తిట్టారు. ఇంతకూ జగన్‌ ప్రధానిని కలుసుకోవడం ఎంత కష్టంగా వున్నా విమర్శ ఆయనపై ఎక్కుపెట్టాలి గాని మోడీని ఆక్షేపిస్తే ఎలా? టిడిపి దూకుడు బ్యాచి ఈ విషయమే మర్చిపోయారు. విదేశాల్లో వుండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ఈ తప్పు తెలిసిపోయింది. అందుకే తర్వాత విమర్శల స్వభావం మారింది. తిరిగి వచ్చాక ఒకటి రెండు రోజులకు ఆయన ఈ నోరుజారిన వారందరికీ తలంటు పోశారట. అది కూడా అందరిముందే! మరీ ముఖ్యంగా రాజేంద్రుడికి ఫోన్‌ చేసి 30 ఏళ్ల రాజకీయజీవితంలో తెలుసుకున్నది ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే మోడీ నుంచి సరైన స్పందన లేక- ఇప్పుడు జగన్‌ ప్రవేశంతో మరింత క్లిష్ట పరిస్థితిలో వుంటే ఇష్టానుసారం మాట్లాడి ఇబ్బందుల్లో పడేశారని ఆయన సన్నిహితులతో అంటున్నారట. వీరి వాచాలత కారణంగా బిజెపిలోని తన వ్యతిరేకులు ఎదురుదాడి చేసే అవకాశం వచ్చిందన్నది ఆయన ఆగ్రహం వెనక బలమైన కారణమంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: