ప్రధాన మంత్రిని ఏపీ ప్రతిపక్షనేత కలిసి వారం పది రోజులు దాటినా ఆ సమావేశం ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భేటీని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు మొదట్లో నోటికొచ్చినట్టు మాట్లాడినా.. ఆ తర్వాత కుదురుకున్నారు. తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించి జోరు తగ్గించారు. 



కానీ ఇప్పుడు ఏకంగా ఆపార్టీ కీలక నేతే వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానితో జగన్ భేటీ అయితే ఇంతమంది ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య కామెంట్ చేయడం వైసీపీకి జోష్ ఇచ్చింది. ఆ మాటలను కోట్ చేస్తూ టీడీపీపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. 



వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీని త‌మ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి కలిసిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. కానీ ప్ర‌త్యేక హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అన్న టీడీపీ నేత‌లకు ఈ రోజు హోదా అని వ్యాఖ్యానించే అర్హ‌త ఎక్క‌డిద‌ని ప్రశ్నించారు. కేసుల కొట్టివేత కోసం జ‌గ‌న్‌ మోదీని క‌లిశార‌ని ఆరోప‌ించడంలో అర్థంలేదన్నారు. 



మరోవైపు ఇదే విషయంపై స్పందించిన మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్.. మోదీని జ‌గ‌న్‌ క‌లిస్తే టీడీపీకి ఎందుకంత ఉలుకో అని ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను పొడిగించాల‌ని సీఎం కేంద్రాన్ని కోరుతున్నారని, అసలు కేంద్రం ఇచ్చిన హామీలు ఎన్ని అమ‌ల‌య్యాయో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.
జ‌గ‌న్‌పై పెట్టిన కేసులు నిల‌బ‌డ‌బోవ‌ని ఉండవల్లి జోస్యం చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: