తెరాస పార్టీ గురించి జరిగిన స‌ర్వేలో అత్య‌ధికంగా కేసీఆర్ కు 98 శాతం మార్కులు ప‌డ్డాయి. ఆయ‌న త‌రువాత రెండో స్థానంలో సీఎం త‌న‌యుడు మంత్రి కేటీఆర్ 91 శాతం సాధించారు. మూడో స్థానంలో మంత్రి హ‌రీష్ రావు 88 శాతంతో ఉన్న‌ట్టు స‌ర్వేలో తేల్చి చెప్పారు. గ‌తంతో పోల్చుకుంటే మంత్రి కేటీఆర్ ప‌నితీరు ఎంతో మెరుగుప‌డింద‌ని తాజా నివేదిక చెబుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా తెరాస‌కు 111 సీట్లు ద‌క్కించుకుంటుంద‌నీ, ఎమ్‌.ఐ.ఎమ్‌.కు 6 సీట్లు ద‌క్కుతాయ‌నీ, మిగిలిన రెండు చోట్ల‌లో కాంగ్రెస్ కు గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేసీఆర్ స‌ర్వే తేల్చింది. కాంగ్రెస్ గెలిచేందుకు అవ‌కాశం ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో మ‌ధిర‌, క‌ల్వ‌కుర్తిలు మాత్ర‌మే ఉన్నాయి. మంత్రులూ ఎమ్మెల్యేల ప‌నితీరు గ‌తంతో పోల్చితే ఎంతో మెరుగుప‌డింద‌ని, వారి ప‌నితీరుకు మార్కులూ ర్యాంకుల‌ను కేసీఆర్ వెల్ల‌డించారు.నిజానికి, గ‌త స‌ర్వేతో పోల్చితే ఈ స‌ర్వేలో ఎంతో మార్పు రావ‌డం విశేషం! కేసీఆర్ చేయించుకున్న గ‌త ర‌హ‌స్య స‌ర్వే ప్ర‌కారం తెరాస త‌రువాత రాష్ట్రంలో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంద‌నీ, మంత్రులూ ఎమ్మెల్యేల ప‌నితీరుపై స్థానికంగా ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మౌతున్న‌ట్టు తేలింద‌ట‌! అందుకనే, మంత్రుల‌కు క్లాసులు తీసుకున్నారు. కాంగ్రెస్ పై మాట‌ల దాడికి దిగారు. అయితే, ఈ మ‌ధ్య కాలంలో ఏం మార్పు వ‌చ్చిందోగానీ.. కాంగ్రెస్ కు రెండు సీట్లు కూడా వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని కేసీఆర్ తాజా స‌ర్వే చెప్ప‌డం విశేషం. అంతేకాదు.. మంత్రుల ప‌నితీరుపై అనూహ్యంగా వ‌చ్చిన మార్పులేంటో తెలీదుగానీ, వారి గ్రాఫ్ లు కూడా అనూహ్యంగా పెరిగిపోయిన‌ట్టు స‌ర్వే వెల్ల‌డించ‌డం మ‌రో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: