వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల రీఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సారి ష‌ర్మిల మాట‌ల్లో మ‌రింతా ప‌దును క‌నిపిస్తోంది. షర్మిల రీఎంట్రీతో పార్టీ క్యాడర్ మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంత‌కీ ష‌ర్మిల ఏం చేయ‌బోతున్నారనే ప్ర‌శ్న అంద‌రిలో ఆస‌క్తిరేపుతోంది.


అన్నవదలిన బాణాన్ని అని అప్పట్లో ప్రకటించిన వైఎస్ ష‌ర్మిల‌.. అన్న జగన్ జైళ్ళో ఉన్నప్పుడు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత అంతగా ఆమె క్రియాశీలకంగా లేరు. జగన్ జైలునుంచి బయటకు రావడంతో ఆమె నిశ్శబ్ధంగా ఉండిపోయారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అంతగా ఆమె ప్రభావం చూపలేకపోయారు. జగన్ లేనప్పుడు అచ్చం వైఎస్ లా ఆమె మాట్లాడి ప్రజల అభిమానం చూరగొన్నారు.


మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమెలో మార్పు కనిపించింది. అమరావతి ప్లీనరీలో ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేశాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుకరిస్తూ తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంతోమంది నిరుపేదలకు వైద్యం అందించారని, విద్యార్ధులకు భరోసా ఇచ్చారని కొనియాడారు వైఎస్ షర్మిల.  ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆనాడు వైఎస్ అనుకున్నారని, అన్న జగన్ ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారన్నారు. చంద్రబాబులా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి ఉంటే 2014 లోనే అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు షర్మిల. 108 వాహనం గురించి ఆమె కుయ్.. కుయ్.. అని చెప్పడం వైఎస్ ను గుర్తుచేసిందంటున్నారు. 


ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమని, అవసరమైతే ప్రతిపక్షంలో కూడా కూర్చుంటానని జగనన్న తనతో చెప్పారన్నారు.ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోలేకనే వైసీపీ గత ఎన్నికల్లో ఉచిత వాగ్దానాలు చేయలేదన్నారు. కేవలం 5 లక్షల ఓట్లతోనే వైసీపీ ఓడిపోయిందని..  చంద్రబాబు గెలిచింది ఆయనపై ఉన్న విశ్వసనీయత చూసికాదని, ఆయనపై నమ్మకం ఉండి కాదని కేవలం మోడీ వల్లనే చంద్రబాబు గెలిచారన్నారు. రైతు రుణమాఫీ పేరిట అన్నదాతలను మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రతి మాటలోనూ పరిణతి కనిపించింది. గణాంకాలను ఉటంకిస్తూ ఆమె చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.  


అబద్ధాలతో అన్నిసార్లు చంద్రబాబు మోసం చేయలేరనీ.. జనం వాస్తవాలను గ్రహిస్తున్నారని రాజన్న రాజ్యం కోసం జనం ఎదురుచూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు పప్పులు ఇక ఉడకవన్నారు. ఆయన ఇంట్లో ఉన్న ఒక్క పప్పు తప్ప అని లోకేష్ ను పరోక్షంగా విమర్శించారు. చంద్రబాబు నేరుగా ఎప్పుడూ తలపడరని, ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు పొడవటమే అన్నారు. షర్మిల ప్రసంగాన్ని జగన్ సైతం ఆసక్తిగా గమనించారు. తన చెల్లిలో వచ్చిన కొత్త‌మార్పును జగన్ నిశితంగా గమనించారు. చెల్లిలి ప్ర‌సంగం జ‌గ‌న్‌లో కూడా స‌రికొత్త కాన్ఫిడెన్స్ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.  2019లో అన్నతో పాటు షర్మిల కూడా పార్టీ విజయావకాశాలను పెంచగలదని కేడర్ విశ్వసిస్తోంది. మొత్తానికి వైఎస్సార్ సీపీకి ష‌ర్మిల ఆశాదీపంలా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: