సిక్కిం సరిహద్దులో ప్రస్తుతం ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్‌ను ప్రతిరోజూ విమర్శించడం, హెచ్చరించడమే పనిగా పెట్టుకున్న చైనా మీడియా అకస్మాత్తుగా భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌ర‌చూ భార‌త్‌పై విరుచుకుప‌డుతున్న చైనా మీడియా స్వ‌రం మారింది. భార‌త‌ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చాలా గొప్ప విష‌య‌మ‌ని ఆకాశ‌నికెత్తింది. జీఎస్‌టీ చాలా గొప్పదని, ఆ ఘనత మోదీకే దక్కుతుందని కొనియాడింది. 


భారత్ క్రమంగా తన సమస్యలను అధిగమిస్తుందని జోస్యం చెప్పింది. జీఎస్టీ కారణంగా లో-కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పింది. మేకిన్ ఇండియాకు జీఎస్‌టీ బూస్ట్‌లా ఉపయోగపడుతుందని తెలిపింది. జీఎస్‌టీ రాష్ట్రాల పన్నుల్లో ఉన్న తేడాలు సమసిపోయానని వివరించింది. ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్ ఏర్పడుతుందని, దీనివల్ల దేశానికి మంచే జరుగుతుందని తెలిపింది. జీఎస్టీ వల్ల భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో వివరించింది.
 
ఒకానొక దశలో భారత్‌తో యుద్ధం తప్పదని కూడా చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. భారత్ వెనక్కి తగ్గకుంటే 1962 నాటి పరిస్థితులను ఇండియా మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే భారత్ అందుకు దీటుగా జవాబిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: