ప‌ది కాదు... ఇర‌వై కాదు... యాభై కాదు...  దాదాపు వెయ్యి కోట్ల‌తో ఏపీ వెల‌గ‌పూడి ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక  ఏపీ భ‌వ‌న్ గొడ‌ల్లో అప్పుడే నీళ్లు లీకౌతున్నాయి. 4వ బ్లాక్‌లోని ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌, మంత్రి గంటా యాంటీ రూం, దేవినేని ఉమ చాంబ‌ర్ తో పాటు ప‌లు చోట్ల వ‌ర్షపు నీరు లోప‌లికి వ‌చ్చి చేరాయి. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్‌ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్‌ తడిసి ఊడిపడింది. 


జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. చంద్ర‌బాబు మాన‌స పుత్రిక, రికార్డు స్థాయిలో వేగంతో నిర్మించిన భ‌వ‌నం.. ఇలా కార‌డం ప‌ట్ల విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

గతంలో స్వ‌ల్ప వ‌ర్షానికే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చాంబ‌ర్‌లోని నీళ్లు వ‌చ్చాయి. చాలా వ్యయంతో నిర్మించిన భ‌వ‌నంలో అలాంటి లీకులు చోటు చేసుకోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.  అయితే అప్ప‌ట్లో టీడీపీ ప్ర‌భుత్వం ఈజీగా త‌ప్పించుకుంది. ఏదో పైపు క‌ట్  కావ‌డంతో నీళ్లు నీళ్లు లోప‌ల‌కు వ‌చ్చాయ‌ని, ఆ పైపు క‌ట్ కావ‌డానికి జ‌గ‌న్ కుట్ర ఉంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు వారించారు. 

జ‌గ‌న్ కావాలనే  పైపులు క‌ట్ చేసి ప్ర‌భుత్వాన్ని అవ‌మాన పరిచేలా చూస్తున్నార‌ని తెలుగుదేశం నేత‌లు అన్నారు. దీనిపై విచార‌ణ చేయాల్సిందేన‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు కూడా. కానీ తాజాగా కురుసిన వ‌ర్షానికి అధికార పార్టీ మంత్రుల చాంబ‌ర్‌లోనే నీళ్లు లీక్ కావ‌డంతో టీడీపీ ప్ర‌భుత్వం  వేలు క‌రుచుకున్నంత ప‌నైంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: