ఫిరాయింపు దారులని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎంకరేజ్ చేసినట్టు గా ఇంకెవ్వరూ చెయ్యలేదు అనే చెప్పాలి. సంవత్సరాలకి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ విషయం మీద చీమ కుట్టినట్టు అయినా స్పందించలేదు ఎవ్వరూ. నిజానికి ఒక పార్టీ మీద గెలిచి మరొక పార్టీ లో చేరి పదవి అనుభవించడం అనేది సనాతన రాజకీయాలలో కామన్ అయిపోయినా అది చాలా పెద్ద పాపం కింద చెబుతారు అప్పటి రాజకీయ వేత్తలు. ఈ అంశం ఈ మధ్యనే హైకోర్టు లో పడింది.


ఏపీ కి చెందిన నలుగురు మంత్రులకి మంగళవారం నాడు హై కోర్టు నోటీసులు అందించింది. వైకాపా టిక్కెట్ పై గెలిచి, తెలుగుదేశంలో చేరినవారిలో ఓ న‌లుగురికి సీఎం చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. వారితో రాజీనామాలు చేయించాల‌నే ఊసే ఇంత‌వ‌ర‌కూ చ‌ర్చ‌కు రావ‌డం లేదు. జంప్ జిలానీల‌ను మంత్రి ప‌ద‌వుల నుంచి తొల‌గించాలంటూ దాఖ‌లైన పిటీష‌న్ పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఒక పాత్రికేయుడు హై కోర్టు లో దాఖలు చేసిన పిటీషన్ ని బేస్ చేసుకుని ఈ నోటీసులు జారీ అయ్యాయి.


నాలుగు వారాలు గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్టు కోరింది. వైసీపీ నుంచి ఎన్నికై, టీడీపీ తీర్థం పుచ్చుకున్నవారిలో అమ‌ర్ నాథ్ రెడ్డి, ఆదినారాయ‌ణ రెడ్డి, సుజ‌య్ కృష్ణ రంగా, భూమా అఖిల ప్రియ ఏపీలో మంత్రులుగా కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు, తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కేసును కూడా ఇదే కేసుతో విచారిస్తామ‌ని కోర్టు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: