మీకు క‌న్న‌డ వ‌స్తుందా? వ‌స్తే ప‌ర్వాలేదు, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉండే అర్హ‌త లేదు, ప్ర‌తి ఒక్క‌రు క‌న్న‌డ భాష నేర్చుకోవాల్సిందే లేక‌పోతే రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలి. ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రో కాదు సాక్షాత్తు కర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య. సివిల్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్‌ కేఆర్‌ నందిని సహా 59 మంది కర్ణాటక ర్యాంకర్లను సిద్ధరామయ్య సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గతంలో ఓ ఐఏఎస్‌ అధికారి కన్నడ నేర్చుకునేది లేదని అన్నప్పుడు, మీ సేవలు అవసరం లేదని అధికారిని కేంద్రానికి తిప్పిపంపించినట్లు గుర్తు చేశారు. సివిల్స్‌ ర్యాంకర్లందరూ ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహించేటప్పుడు ఆ స్థానిక భాషను నేర్చుకుని మంచి పరిపాలన అందించాలని సూచించారు. మొదటి ర్యాంకర్‌ నందిని కర్ణాటక సర్వీసునే ఎంచుకోవాలని సీఎం కోరారు. ఇక్కడ పనిచేసే ఏ అధికారి అయినా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 


మరోవైపు హిందీ భాషకు వ్యతిరేకంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. హిందీ భాషలో రాసిన ప్రకటనలపై నల్ల రంగు పూశారు. యశ్వంత్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ వెలుపల ఉన్న హిందీ అక్షరాలతో రాసిన పేరు కనిపించకుండా బుధవారం రాత్రి నల్లరంగు వేశారు. ఇందిరా నగర్‌ మెట్రోస్టేషన్‌ వెలుపల హిందీ ప్రకటనలు కనిపించకుండా పోస్టర్లు అతికించారు. కేంద్రంపై తమపై హిందీని రుద్దుతోందని కర్ణాటక రక్షణ వేదిక ఆరోపిస్తోంది.

కాగా, తమ  రాష్ట్రానికి ప్రత్యేక జెండా తేవడం కోసం సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. బీజేపీ హిందుత్వ అజెండాకు కౌంటర్‌గానే ఆయనీ కార్యం తలపెట్టారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ఇవన్ని చేస్తున్నారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: