నియోజకవర్గాల పునర్విభజన .. రెండు తెలుగురాష్ట్రాలకు అత్యవసరం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెంచాలని విభజన బిల్లుల్లో స్పష్టంగా పేర్కొంది. ఏపి, తెలంగాణల్లో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఆ బైఫర్కేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. అయితే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి మూడేళ్లు పూర్తైనా ఆ దిశగా ఒక్క అడుగుకూడా పడలేదు. ముఖ్యమంత్రులు, రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు మాత్రం పునర్విభజన ఉంటుందనే చెప్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దానిపై బిల్లు పాస్ చేయించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు..

Image result for assembly telangana

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏపిలో 225 నియోజకవర్గాలు, తెలంగాణలో 175 నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని విభజన బిల్లు చెబుతోంది. రెండు రాష్ట్రాల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం పునర్విభజన అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కాకముందు నియోజకవర్గాల పునర్విభజనపై వెంకయ్యనాయడు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు..

Image result for kcr chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని ప్రతిసారీ నియోజకవర్గాల పునర్విభజనపై అడుగుతూనే ఉన్నారు. కానీ కేంద్రం నుంచి ఇదిగో.. అదిగో.. అనే సమాధానం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి.. కోవింద్ కు మద్దతిచ్చే సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని షరతు కూడా పెట్టారు.

Image result for ysrcp congress

వచ్చే ఎన్నికల లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాలనేది తెలుగు ముఖ్యమంత్రుల కోరిక. లేకుంటే ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఎందుకంటే విపక్షాలను బలహీనపర్చడం.. పార్టీ బలోపేతం అంటూ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ బాగానే సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఒక్క గుంటూరు జిల్లా మినహా అన్ని చోట్ల ఇదే పరిస్థితి. రాయలసీమ జిల్లాల నుంచి 9 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా ఏకంగా నలుగురు మంత్రి పదవులు దక్కించుకున్నారు. కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల్లో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. ఉత్తరాంధ్రలో ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరారు.

Image result for tdp

పార్టీ ఫిరాయింపులు జరిగిన అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలకు మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా తయారైంది.. కడప జిల్లా జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి టీడీపీలోకి రావడంతో.. అక్కడ ఎంతోకాలంగా పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డి అలకబూనారు. దశాబ్దాల ఆధిపత్యపోరు ఎలా చల్లారుతుందని ఆయన ప్రశ్నించారు. అయితే పలుదఫాల చర్చల అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతో కాస్త చల్లబడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ముత్తుమాల అశోక్ రెడ్డితో స్ధానిక టీడీపీ నేత అన్నా రాంబాబుకు పొసగడం లేదు. విజయవాడ వెస్ట్ నుంచి వైసిపి టికెట్ తో గెలిచిన జలీల్ ఖాన్ సైకిలెక్కడంతో మొన్న ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ వైసిపిలోకి వెళ్లిపోయారు..

Image result for trs tdp

తెలంగాణలో వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపిని తనలో కలిపేసుకుంది టీఆర్ఎస్. టీడీపీ తరపున 15 మంది గెలిస్తే.. వారిలో 12 మంది గులాబీ కండువా కప్పేసుకున్నారు.. 21 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్ కు ప్రస్తుతం మిగిలింది 15 మందే.! ఇలా వలస వచ్చిన వారందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని గులాబీబాస్ హామీ ఇచ్చారు. పునర్విభజన జరగకపోతే వలసదారులందరికీ నియోజకవర్గాలను అడ్జెస్ట్ చేయడం ఆషామాషీ కాదు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నియోజకవర్గాల పునర్విభజన అత్యవసరం. లేకుంటే అధికార పార్టీలకు తలనొప్పులు తప్పవు. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్.. తాయిలాలు చూపిస్తూ పార్టీలో కలుపుకున్నాయి. నియోజకవర్గాలు పెరగకపోతే టికెట్ ఆశావహులు పక్కపార్టీ తలుపులు తట్టడం ఖాయం. ఆ పరిస్థితి తలెత్తితే ఇద్దరు చంద్రులకీ ఇబ్బందే.!

మరింత సమాచారం తెలుసుకోండి: