రాష్ట్రపతి భవన్ కొత్తకళ సంతరించుకుంది. ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియడంతో కొత్త రాష్ట్రపతిగా రామనాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.ఖేహర్.. కోవింద్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త రాష్ట్రపతి కోవింద్ ను .. ప్రణబ్ ముఖర్జీ తన సీటులో కూర్చోబెట్టారు.


పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశీ దౌత్యాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారం సందర్భంగా 21వ శతఘ్నలను పేల్చి గౌరవ వందనం సమర్పించారు.

Image result for kovind oath

దేశ ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తి కోవింద్ కావడం విశేషం. అంతేకాదు.. బీజేపీ బలపరిచిన వ్యక్తి రాష్ట్రపతి కావడం కూడా ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా కోవిందే కావడం ఆ రాష్ట్రవాసులను సంబరాల్లో ముంచెత్తింది. యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ పై రామనాథ్ కోవింద్ 65.5 శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా కుమార్ కూడా కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.

Image result for kovind oath

న్యాయవాదిగా చాలాకాలం పనిచేసిన రామనాధ్ కోవింద్.. అనంతరం బీజేపీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. పలు కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. ఆ తర్వాత బీహార్ గవర్నర్ గా వెళ్లారు. బీహార్ గవర్నర్ గా ఉన్నప్పుడే ఆయన్ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఎన్నికల్లో గెలుపొందడంతో ఆయన ప్రథమ పౌరుడిగా బాధ్యతలు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: