చాలాకాలం త‌ర్వాత రాముల‌మ్మ సీన్‌లోకి వ‌చ్చింది. సీఎం కావాల‌ని ఉంద‌ని మ‌న‌సులోని మాట చెప్పేసింది. త‌న‌కు కూడా ప్ర‌శ్నించే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని చెప్పేసింది. గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయాలకు, సినిమాల‌కు దూర‌మైన‌ విజ‌య‌శాంతి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసింది. 


మీకు ‘సీఎం విజయశాంతి’ అనిపించుకోవాలనే కోరిక ఉందా? అనే ప్ర‌శ్న‌కు..  సీఎం కావడంలో త‌ప్పులేద‌ని స‌మాధ‌న‌మిచ్చింది. ‘‘సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇంకా సక్సెస్‌ వస్తే బాగుంటుందనిపిస్తుంది. సూపర్‌స్టార్‌ అయితే బాగుంటుందనిపిస్తుంది. ఏ ఆర్టిస్ట్‌కైనా ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుంది. టాప్‌ పొజిషన్‌కి రావాలనుంటుంది. అలాగే, రాజకీయాల్లో పందొమ్మిదేళ్లు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్ని అవకాశాలొచ్చినా పక్కన పెట్టి... తెలంగాణ సాధించేవరకు నా మైండ్‌లోకి ఏదీ తీసుకోనని భీష్మించుకుని కూర్చుని అంత నిజాయితీగా పనిచేసి, టార్గెట్‌ రీచ్‌ అయ్యా. తెలంగాణ సాధించా. ఇప్పుడు దేవుడు, ప్రజలు అవకాశం ఇస్తే... సి.ఎం. కావడంలో తప్పు లేదు.’’ అని చెప్పింది. 


టీఆర్ఎస్ లో ఉండి ఉంటే  ఒక పెద్ద పదవి పొంది ఉండేవారేమో? అనే ప్ర‌శ్న‌కు ఇలా బ‌దులిచ్చింది. ‘‘నాపై కొన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ప్రతిభ ఉన్నోళ్లకు ఇబ్బందులు తప్పవు. రాజకీయాలు అన్నప్పుడు వెన్నుపోట్లు తప్పవు. ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయి. ప్రజలు ఆశించినట్టు జరగాలంటే జాతీయ పార్టీల ద్వారానే సాధ్యపడుతుంది. జరిగిందేదో జరిగింది. అయినా, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాకా గ్రాటిట్యూడ్‌ ఉంది. పదవులన్నది ఈరోజు రాకపోవచ్చు, రేపు రావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే తృప్తి నాకుంది. అది పదవుల కంటే ఎక్కువని అనుకుంటున్నా. పదవులది ఏముంది? ఐదేళ్లు అధికారంలో ఉంటారు. తర్వాత ప్రజలు మరొక పార్టీకి ఓటేస్తారు. కానీ, ఈ అచీవ్‌మెంట్‌ అనేది మళ్లీ రాదు. గాంధీగారు దేశ స్వాతంత్య్రం కోసం శ్రమించినట్టు, నేను తెలంగాణ కోసం 19 ఏళ్లు కష్టపడ్డా. నాకది బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌.’’ అంటూ చెప్పుకొచ్చింది రాముల‌మ్మ‌.


మొత్తానికి రాముల‌మ్మ తాజా కామెంట్స్ చూస్తుంటే త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టేలా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: