2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ ఏ విధ‌మైన పోటీలో పాల్గొన‌బోమ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకున్న‌ నిర్ణ‌యం ఇప్పుడు టీడీపీకి శ‌రాఘాతంలా మారింది. కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ‌పై ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ చ‌ర్య‌ల ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావించినా.. ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న‌ నేత‌లు ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ముఖ్యంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల ప్ర‌భావం కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. కాకినాడ న‌గ‌రంలో కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌జ‌ల‌తోపాటు ప‌వ‌న్ అభిమానులు కూడా అధికంగా ఉన్న విష‌యం తెలిసిందే! ఇదే ఇప్పుడు వీరిని భ‌య‌పెడుతోంది. 

kakinada municipal corporation కోసం చిత్ర ఫలితం

నంద్యాల ఉప ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు సంద‌ట్లో స‌డేమియాగా.. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా హ్యాండ్ ఇవ్వ‌డంతో ఒకేసారి టీడీపీ నేత‌ల‌ను క‌ష్టాలు చుట్టుముట్టేశాయి. ఇప్పటి వరకూ జనసేన పై నమ్మకం పెట్టుకున్న ఆ పార్టీ పవన్ కల్యాణ్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు అధికారం తమకు వస్తుందా? రాదా? అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో బయలుదేరింది. కాకినాడలో పవర్ స్టార్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఎక్కువ అభిమానులూ కాకినాడ సిటీలోనే ఉన్నారు. కాకినాడలో పవన్ సత్తా ఏంటో 2014 ఎన్నికల్లో టీడీపీకి స్పష్టంగా తెలిసి వచ్చింది. 


పవన్ పుణ్యమా అని తెలుగుదేశం అభ్యర్ధి వనమాడి కొండబాబుకు 22 వేల భారీ మెజారిటీ లభించింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం కూడా పవన్ వల్లే మూడు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారని టీడీపీ నేతలే అంగీకరిస్తారు. అయితే అదంతా గ‌తం. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు టీడీపీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారాయి. కాకినాడ కార్పొరేషన్ లో ఉన్న 48 వార్డుల్లో 39 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తోంది. 9 వార్డులను మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించింది. బీజేపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇక్క‌డ కాపు సామాజిక‌వ‌ర్గ ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. వీరు ఎటువైపు మొగ్గుచూపుతార‌నేది కీల‌కంగా మారింది. 

janasena-tdp logos కోసం చిత్ర ఫలితం

పవన్ ఫొటోతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందవచ్చని టీడీపీ నేత‌లు భావించారు. తాను ఎవరికీ మద్దతివ్వబోనని ప‌వన్ తేల్చేయ‌డంతో నేతల‌ ఆశలు సన్నగిల్లాయి. ఇక మ‌రోవైపు కాపు నేత ముద్రగడ దీక్ష కూడా విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. పవన్, మరోవైపు ముద్రగడతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందంటున్నారు విశ్లేషకులు. కాపు మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, కళా వెంకట్రావులు అక్కడే తిష్టవేసి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.  మొత్తానికి ప‌వ‌న్ ఎఫెక్ట్ టీడీపీపై బాగా ప‌డిందనే చెప్పుకోవాలి! 


pawan kalyan janasena hd images కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: