ముస్లిం సంప్రదాయంలో భార్యకు విడాకులివ్వడానికి మూడుసార్లు తలాక్ అని చెప్తే చాలు.. విడాకులు ఇచ్చేసినట్లే. అయితే ఇది అన్యాయమని, దీనివల్ల మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు వెల్లడించింది. సంప్రదాయానికి, హక్కులకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో హక్కులవైపే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. ట్రిపుల్ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ పద్ధతి చెల్లదని తేల్చిచెప్పింది.

 Image result for talaq cases in india

మహిళల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించేలా ట్రిపుల్ తలాక్ పద్ధతి ఉందని, ఈ పద్ధతిని తొలగించేలా చట్టం తీసుకురావాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెల్లడించింది. ఖురాన్‌ నియమాలకు తలాక్‌ వ్యతిరేకంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై పార్లమెంట్‌లో 6 నెలల్లోగా చట్టం తేవాలని ఆదేశించింది.

 Image result for talaq cases in india

చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ట్రిపుల్ తలాఖ్ కేసును విచారించింది. జస్టిస్ కురియన్‌, జస్టిస్ లలిత్‌, జస్టిస్ నారిమన్‌లు ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకించారు. ఇస్లాం దేశాల్లో దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. కానీ చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌, జస్టిస్‌ నజీర్‌ మాత్రం తలాక్‌ అంశాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు చెప్పారు. అది దశాబ్దాల నాటి ఆచారమని.. దానిపై తాము జోక్యం చేసుకోలేమన్నారు.

 Image result for talaq cases in india

ట్రిపుల్ తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చేంత వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని స్పష్టం చేసింది. చట్టం చేసిన తర్వాతే దానికి లోబడి కేసులను విచారిస్తామని పేర్కొంది. ఇందుకోసం కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది. అప్పటివరకూ తలాక్‌ చెల్లుబాటు కాదని నిషేధం విధించింది.

 Image result for talaq cases in india

ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధినేత అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ‘ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు చరిత్రాత్మకం. ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సమనత్వాన్ని తీసుకొచ్చింది. మహిళాసాధికారతకు ఇదో నిదర్శనం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ట్రిపుల్ తలాక్ పై సుప్రీం నిర్ణయం ఆమోదయోగ్యమైనదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మేనకా గాంధీ అన్నారు. సుప్రీం తీర్పుపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆనందం వ్యక్తం చేసింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: