తాజాగా ఉప ఎన్నిక జోరు, హోరుతో అదిరిపోతున్న నంద్యాలపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గానికీ లేనంత ఆస‌క్తి, ఉత్కంఠ ఇక్క‌డ నెల‌కొంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం... ఈ నియోజ‌క‌వ‌ర్గం అనేక మంది మేధావుల‌కు సంచ‌ల‌న విజ‌యాల‌ను క‌ట్ట‌బెట్ట‌డ‌మే. సామాన్య స్థాయి నుంచి అసామాన్య రీతిలో దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి, దేశాన్ని పాలించే ఎదిగిన ఎంద‌రో మేధావుల‌కు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం  కేరాఫ్‌గా మారింది. పీవీ న‌ర‌సింహారావు, నీలం సంజీవ‌రెడ్డి వంటి మేధావులు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే గెలిచి దేశానికి ప్రాతినిధ్యం వ‌హించారు. దీంతో దేశం మొత్తం రాజ‌కీయాలు కూడా నంద్యాల వైపు చూశాయి. 

p.v.narasimha rao కోసం చిత్ర ఫలితం

ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌పైనా దేశం దృష్టి ఉంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చినా త‌ప్పులేద‌ని పిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌తో దేశం ఒక్క‌సారిగా నంద్యాల‌వైపు దృష్టి సారించింది. అస‌లు నంద్యాల‌లో ఏం జ‌రుగుతోందో ప‌రిశీలించింది. ఇక‌, ఇప్పుడు ఇక్క‌డ‌,  జరుగుతున్న ఉప ఎన్నికల పోరు జ‌గ‌న్‌, చంద్ర‌బాబుల‌కు అగ్నిపరీక్షగా నిలిచింది. కాంగ్రెస్ బ‌రిలో నిలిచినా.. ప్ర‌భావం అంతంతే! దీనికితోడు ఇప్పుడు ఇక్కడి గెలుపు 2019 ఎన్నికలకు నాందిగా  టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ తన ఉనికి ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


ఈ విష‌యాల‌ను కొంచెం సేపు ప‌క్క‌న పెడితే.. నంద్యాల చ‌రిత్ర‌ను ఒక్క‌సారి తిర‌గ‌దోడ‌దాం పదండి.  దశాబ్దాల క్రితమే నంద్యాల జాతీయస్థాయిలో వార్తల్లో కెక్కింది. నీలం సంజీవరెడ్డి, పీవీ న‌ర‌సింహారావు, పెండేకంటి వెంకటసుబ్బయ్య వంటి దిగ్గజాలు ఇక్కడి నుంచి పోటీ చేశారు.  తొలుత 1977 మార్చిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అనంతపురం జిల్లా ఇల్లూరుకు చెందిన నీలం సంజీవరెడ్డి ఇక్కడ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండేకంటి వెంకటసుబ్బయ్యను 35 వేలకు పైగా మెజారిటీతో ఓడించి చరిత్ర సృష్టించారు. ఇది అప్పట్లో నిజంగా సంచలనమే.

neelam sanjiva reddy కోసం చిత్ర ఫలితం

 1991లో నంద్యాల మరోసారి చరిత్ర కెక్కింది. నాటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీ అభ్యర్థి చల్లా రామకృష్ణారెడ్డి పై 1,86,766 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. అయితే, అనూహ్య రీతిలో కేంద్రంలో ప‌రిస్థితులు మారిపోయాయి. రాజీవ్ గాంధీ హ‌త్య‌కు గుర‌య్యారు. దీంతో ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టిన పీవీ న‌ర‌సింహారావు  ఆరు నెల్లలో లోక్ సభకు ఎన్నిక కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో పీవీ నంద్యాల నుంచి పోటీ చేశారు. పీవీ కోసం అప్పట్లో ఎంపీగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు. ఏక పక్షంగా జరిగిన ఈ ఎన్నికలో పీవీ 4,41, 142 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. పీవీ పోటీతో నంద్యాల పేరు జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో మార్మోగిపోయింది. స్వయంగా ఒక ప్రధాని పోటీ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అత్యధిక మెజారిటీ కూడా రికార్డే. 
అనంతరం 1996లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా పీవీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిని ఓడించారు.


ఇక్కడి నుంచి నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండేకంటి వెంకటసుబ్బయ్య కేంద్రంలో కీలకపాత్ర పోషించారు. 1967లో పెండేకంటి సీపీఐ అభ్యర్థి 1,68,825 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1971లో మళ్లీ సమీప ప్రత్యర్థి కె.ఎ. రెడ్డిపై 1,30, 456 ఓట్ల మెజారిటీతో పెండేకంటి గెలుపొందారు. అయితే,  1984లో టీడీపీ అభ్యర్థి మద్దూరి సుబ్బారెడ్డి చేతిలో పెండేకంటి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ ఆయనకు గవర్నర్ గిరీని కట్టబెట్టారు.  ఇలా.. నంద్యాల నుంచి పోటీ చేసి జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన‌వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. 

gangula pratap reddy కోసం చిత్ర ఫలితం



మరింత సమాచారం తెలుసుకోండి: