తెలంగాణా లో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద డిస్కషన్ ఉప ఎన్నిక మ్యాటర్ .. నల్గొండ ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా అనే చర్చ మొదలైంది . ఈ ఎన్నిక ద్వారా తమ సత్తా చాటుతూ ఒకేసారి కాంగ్రెస్ ని తోక్కేయడం కేసిఆర్ లక్ష్యం గా చెబుతున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ తో రాజీనామా చేయించి వెంటనే ఉప ఎన్నికకి రంగం సిద్ధం చేసారు అని ఈ మధ్యన కథనాలు వస్తున్నాయి.


తెరాస పార్టీ శ్రేణులకి కేసిఆర్ కొత్తగా ఇచ్చే బూస్ట్ ఇదే అన్నమాట. గుత్తా కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి కావడం తో ఆ స్థానాన్ని తాము కైవసం చేసుకోవాలి అనేది కాంగ్రెస్ ప్లాన్. మరొక పక్క టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తోంది. నల్గొండ బరిలో రేవంత్ ని దింపాలి అనేది వారి ఆలోచన. న‌ల్గొండ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క వ‌ర్గాల్లో రేవంత్ రెడ్డికి అనుకూల‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌నీ, రేవంత్ ని బ‌రిలోకి దించితే తెరాస‌కు స‌మ‌ర్థంగా ఎదుర్కొని, రాష్ట్రంలో పార్టీ ఉనికిని నిలుపుకోవ‌చ్చు అనేది టీడీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది.


అయితే ఎవరి ప్లాన్ వారిది కాగా ఈ టైం లో గుత్తా రాజీనామా చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే టెక్నికల్ పరిస్థితులు ఉన్నట్టు కనపడ్డం లేదు. తెరాస లో సరైన మంత్రి పదవి కూడా లేని సుఖేందర్ ఇంకా కాంగ్రెస్ బీఫాం మీద గెలిచిన ఈ పదవిని వదలడం లేదు. గుత్తా రాజీనామా చేసిన వెంటనే ఎన్నికలు రావడం అనేది కష్టమే నేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఆయన రాజీనామా చేసిన ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎన్నికల కమీషన్ కి ఉంది. అంటే వచ్చే ఫిబ్రవరి లోగా ఎన్నిక ఉండకపోవచ్చు . వచ్చే ఏడాది మధ్యలోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చేయచ్చు కూడా. కొన్ని రాష్ట్రాల శాస‌న స‌భ‌ల ఎన్నిక‌ల‌తోపాటు, లోక్ స‌భ ఎన్నిక‌ల్ని కూడా క‌లిపి నిర్వ‌హించాల‌ని కేంద్రం భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని కోసం అవ‌స‌ర‌మైన రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో మాట్లాడి, ముందు వెన‌క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అలాంటి పరిస్థితి లో ఎలక్షన్ కమీషన్ హడావిడి గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్తెస్తుందా అంటే డౌటే.


మరింత సమాచారం తెలుసుకోండి: