చంద్రబాబు కేబినెట్ కు ఒక బీజేపీ మంత్రి గుడ్ బై చెప్పబోతున్నారా..? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా అవమానాలు భరిస్తున్నా... అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ఇక ఎంతమాత్రం సహించే స్థితిలో తాను లేనని అనుచరుల వద్ద ఆయన వాపోతున్నట్టు సమాచారం. వెంటనే బీజేపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకూ ఎవరా మంత్రి..?

Image result for manikyala rao

                పైడికొండల మాణిక్యాల రావు.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి. బీజేపీ నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేరారు. మూడేళ్లుగా అదే శాఖ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై ఆయనదే అజమాయిషీ. కానీ ఒక్క గుడి విషయంలో మాత్రం ఆయనకు అనేక అవమానాలు ఎదురవుతున్నాయట. అదే ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం. ఇక్కడి పాలకమండలి మంత్రిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో.. మంత్రి కినుక వహించారు.

Image result for manikyala rao

          దసరా ఉత్సవాలకు దుర్గగుడి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదట. కాగా మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ మీటింగ్ లో అన్నీ తానై వ్యవహరించారట. వాస్తవానికి దసరా ఉత్సవాలపై చర్చించేందుకు మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరగాలి. అయితే గురువారం జరిగిన సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి మంత్రి దేవినేనికి ఆహ్వానం అందింది కానీ దేవాదాయ శాఖ మంత్రికి మాత్రం అందలేదు.

Image result for manikyala rao

          అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు మంత్రి దేవినేనే పట్టువస్త్రాలు సమర్పించారు. రెండో ఏడాది ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇక్కడ కూడా తనకు తగిన గౌరవం దక్కలేదని మంత్రి మాణిక్యాల రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి తనకు అవమానం జరగడంతో ఇక ఎంతమాత్రం సహించే ఉద్దేశంలో లేనట్టు సమాచారం. అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: