గత కొన్ని రోజుల నుంచి రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి.  కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అత్యంత వేగం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.  ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.  తాజాగా తమిళనాడులోని పాలాయం కొట్టం వద్ద శనివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.


కావేరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 26 మంది ఈ నెల 13న శ్రీబాలాజీ ప్రయివేటు ట్రావెల్స్‌లో వెళ్లారు. కాలకృత్యాల కోసమని బస్సును రోడ్డు పక్కన నిలిపారు. అందులో ఉన్న ఇద్దరు మహిళలు బస్సు దిగి వెళ్లగా..సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ అత్యంత వేగంతో ఆ బస్ ని ఢీ కొట్టింది.  ఈ రెండు వాహనాల మధ్య ఉన్న మహిళలు, బస్సు పక్కనున్న మరో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతుల్లో కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన దేసు వెంకట రామారావు (65), కన్నెగంటి రామయ్య(62), అనంతవరానికి చెందిన గొడవర్తి నాగవర్ధిని(43), తెనాలిలోని బాలాజీరావుపేటకు చెందిన మెట్టా సత్యం(42), గుంటూరుకు చెందిన కె.రత్నమాణిక్యం(64) ఉన్నారు. తిరునల్వేలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి స్వస్థలమైన గుంటూరుకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులను ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప శనివారం ఆదేశించారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఏడుగురు క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సిబ్బందికి చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: