ఏపీ సీఎం చంద్ర‌బాబుకు టాలీవుడ్ ద‌ర్శ‌కులపై అభిమానం రోజురోజుకు పెరిగిపోతోంది! సినిమాలు ఏమాత్రం చూడ‌ని ఆయ‌న‌.. ఇప్పుడు ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న గోదావ‌రి, కృష్ణా పుష్కరాల బాధ్య‌త బోయ‌పాటి శ్రీ‌నుకు అప్ప‌గించారు. ఇక క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ డిజైన్ల రూప‌క‌ల్ప‌న దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేతుల్లోకి వెళ్లిపోయింది. బాహుబ‌లి సెట్టింగులు చూసి మంత్ర ముగ్థులైపోయిన చంద్ర‌బాబు.. అంత‌కు మించిన స్థాయి లో భ‌వంతులు నిర్మించే బృహ‌త్త‌ర బాధ్య‌తను ద‌ర్శ‌క‌ధీరుడికి అప్ప‌గించి రిలాక్స్ అయిపోయారు. ఇక పోల‌వ‌రాన్ని కూడా మరో ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ కు అప్ప‌గిస్తారేమోన‌న్న సెటైర్లు బాబుమీద ప‌డిపోతున్నాయి.


టాలీవుడ్ ద‌ర్శ‌కులు, అంత‌ర్జాతీయ ఆర్కిటెక్ సంస్థ‌ల‌ మ‌ధ్య పోటీ పెరుగుతోంది! ద‌ర్శ‌కుల ప్ర‌తిభ ముందు ఇంజినీర్ల నైపుణ్యం చిన్న‌బోతోందా అనేంతగా ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నో సుంద‌ర భ‌వ‌నాలు, క‌ట్ట‌డాలు నిర్మించిన ఇంజినీరింగ్ సంస్థ‌లు తెచ్చిన డిజైన్లు టీడీపీ అధినేత మ‌న‌సు దోచుకోలేక‌పోయాయేమో! ప్రపంచ స్థాయి హంగుల‌తో నిర్మించే రాజధానికి ఆర్కిటెక్ సంస్థ‌ల డిజైన్లు ఎందుకు అనుకున్నారో ఏమో!! ప్రపంచ‌మే ఫిదా అయిన బాహుబ‌లి సెట్టింగులే కావాలంటున్నారు చంద్ర‌బాబు! ఏ బేషజం లేకుండా మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ .. ఒక దర్శకుడి ముందు కూర్చొని అమరావతి గురించి వివరించారు. దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.


ఇక ఒక టెన్ష‌న్ చంద్ర‌బాబుకు తీరిపోయింద‌నుకుంటే మ‌రో ఆందోళ‌న మొద‌లైంది. అదే పోల‌వ‌రం. 2018 చివ‌రి నాటికి ఎలాగైనా ప‌నులు పూర్తిచేయాల‌నే సంకల్పంతో ఉన్నారు టీడీపీ అధినేత‌. ఇక ఈ ప్రాజెక్టు బాధ్య‌త వినాయ‌క్‌కు అప్ప‌గించేస్తే స‌రిపోతుంద‌నే వ్యంగ్యాత్మ‌క సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బన్నీ సినిమాలో వినాయక్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాడు. అందుకే రానున్న రోజుల్లో ప్రతిష్టాత్మక పోలవరం పనులు వినాయక్ కు అప్పగించే అవకాశం ఇస్తారేమోన‌ని కొంద‌రు బాబును టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.


ఇప్పటికే ట్రాన్స్ ట్రాయ్ కట్టలేకపోతోంది అని చంద్రబాబు తెగ బాధ పడుతున్నారు. సినిమా లో డాం కట్టినంత మాత్రాన పోలవరం పనులు ఇచ్చేస్తారా అని అడగకండి.. బాహుబలి లో అద్భుతం గా సెట్లు, గ్రాఫిక్ లు వేసిన రాజమౌళి కి ప్రతిష్టాత్మక అమరావతి డిజైన్ లు ఎంపిక చేసే బాధ్యత అప్ప‌గించేయ‌లా!! సినిమాలు వేరు, నిర్మాణాలు వేరు అని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. మరి ఈ ప్రభుత్వానికి ఇటువంటి ఐడియాలు ఇచ్చేది ఎవరో తెలియడం లేదు. ఏ మాత్రం అవగాహన లేని, అనుభవం లేని అధికారులదే ఈ తప్పు అనిపించ‌క మాన‌దు. ఇక్క‌డ‌ ఎవ‌రి ప్ర‌తిభ‌ను తీసిపారేయ‌లేం.. కానీ సినిమా అనేది ఊహాద్భుతం! దానిలో వేసిన సెట్టింగులు ఏడాది, రెండేళ్లు ఉంటాయి. కానీ రాజ‌ధాని.. వాస్త‌వం. చరిత్ర‌లో నిలిచిపోవాల్సిన అద్భుతం! కొన్ని విష‌యాలు వ్యంగ్యం తో చెపితేనే కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి మ‌రి..! 


మరింత సమాచారం తెలుసుకోండి: