రాజ‌కీయాల్లో ఎంత‌టి పండితుల‌కైనా ఆటు పోట్లు త‌ప్ప‌వు! సింహం ఎంత బ‌లంగా ఉన్నా.. చిన్న పాటి ఈగ‌లు ఆట‌ప‌ట్టించిన‌ట్టు.. రాజ‌కీయాల్లో ఉన్న వారు కూడా చిన్న‌స్థాయి వారికి సైతం జ‌వాబు చెప్పాల్సిన ప‌ని, అవ‌స‌రం రెండూ ఉండే ప‌రిస్థితులు ఉన్నాయి. తాజాగా తెలంగాణ స్పీక‌ర్‌గా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు వివాద ర‌హితునిగా పేరు తెచ్చుకున్న  సిరికొండ మధుసూదనాచారి, ఆయ‌న కుమారుల‌పై ఒక్క‌సారిగా రాజ‌కీయ అగ్గి రాజుకుంది. ఆయ‌న ఆర్థికంగా త‌న‌ను మోసం చేశార‌ని, ఆయ‌న కుమారులు పార్టీకి ద్రోహం చేశార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

అంతేకాదు, వీటిపై ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ‌లు, ఫేస్‌బుక్‌లో వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటిని పోస్ట్ చేసింది. పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొలపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి. విష‌యంలోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ జిల్లా భూపాల ప‌ల్లి నుంచి స్పీక‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న గెలుపుకోసం శ్రీనివాస‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొలాల‌ను అమ్మి మ‌రీ ఖ‌ర్చు చేసిన‌ట్టు ఇప్పుడు చెబుతున్నారు. ఇదంతా ఓ ఒప్పందం ప్ర‌కారం జ‌రిగింద‌ని, దీని ప్ర‌కారం.. తాను నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో మ‌ధుసూద‌నాచారి గెలుపుకోసం రూ.98.58లక్షలు ఖర్చుచేశానని, అయితే, ఈ మొత్తంలో కేవలం రూ.50.35 లక్షలు మాత్రమే త‌న‌కు ముట్టాయ‌ని మిగిలిన మొత్తం  రూ.48 లక్షలు స్పీక‌ర్ ఇవ్వ‌లేద‌ని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

ఈ మొత్తం ఇప్పించాలంటూ.. కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. అంతేకాదు,  గత సింగరేణి ఎన్నికల్లో భూపాలపల్లిలో పార్టీ ఓటమికి ప్రధాన కారణం స్పీకర్‌ కుమారులేనని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో సిరికొండ కుమారుల ఆగడాలు శ్రుతిమించాయన్నారు. నియోజకవర్గంలో ప్రతిపనికి వారు డబ్బులను వసూలు చేస్తూ, పార్టీ కార్యకర్తలను పీక్కుతింటున్నారని ఆరోపించారు. ట్రాక్టర్ల పథకం, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలతో పాటుగా లక్షకు రూ.10వేల చొప్పున కమీషన్లను వసూలు చేస్తూ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

సిరికొండ కుమారుల ఆగడాలను కట్టడి చేయకపోతే పార్టీకి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఒక పక్క రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మంచి పనులు చేస్తుండగా.. భూపాలపల్లిలో మాత్రం పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని నిప్పులు చెరిగారు. దీనిని వీడియోగా తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ప‌రిణామంతో అధికార పార్టీ మ‌రో చిక్కులో ఇరుక్కుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొలపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఒక్క‌డే ఇలా స్పీక‌ర్‌పై నింద‌లు వేశారంటే న‌మ్మే ప‌రిస్థితి ఉండ‌ద‌ని, దీనివెనుక మ‌రెవ‌రో ఉన్నార‌ని అంటున్నారు.

స్పీక‌ర్ వంటి బ‌ల‌మైన నేత‌పై ఆరోప‌ణ‌లు చేయాలంటే.. గ‌ట్స్ ఉండాల‌ని, శ్రీనివాస‌రెడ్డికి అంత‌లేద‌ని, దీని వెనుక  వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నేత ఉన్నార‌ని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.  మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక‌, కాంగ్రెస్ ఈ ఆరోప‌ణ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేసింద‌ని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: