ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ పై వివాదం కొనసాగుతోంది. తాజ్ మహల్ ను పర్యాటక కేంద్రాల జాబితా నుంచి ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఆ గొడవ సద్దుమణగక ముందే అసలు తాజ్ మహల్ ను కట్టింది ద్రోహులనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో.. బీజేపీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Image result for tajmahal

          ఇటీవల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో కూడిన ఓ బుక్ లెట్ రూపొందించింది. అందులో ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ లేదు. ఇది ఉత్తరప్రదేశ్ వాసులనే కాక... దేశంలోని ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదట జాబితాలో దాన్ని పొరపాటున మరిచిపోయారేమో అనుకున్నారు. అయితే ఆ తర్వాత అర్థమైంది అది వాంటెడ్ గానే తొలగించారని..! ముస్లింలు కట్టిన తాజ్ మహల్ ను పర్యాటక ప్రదేశంగా గుర్తించేందుకు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ సిద్ధంగా లేదు. అందుకే దాన్ని పక్కనపెట్టారు.

Image result for tajmahal

          ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తాజ్ మహల్ ను దేశద్రోహులు కట్టారని కామెంట్ చేశారు. సర్ధానా నియోజకవర్గం నుంచి గెలిచిన సంగీత్ సోమ్.. చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వివాదం కలిగిస్తున్నాయి. “ యూపీ టూరిజం పుస్తకం నుంచి తాజ్ మహల్ ను తొలగించడంపై చాలా మంది నిరాశ చెందుతున్నారు. ఏ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం? తాజ్ మహల్ ను నిర్మించిన షాజహాన్ తన తండ్రినే నిర్బంధించాడు. అతడు హిందువులను తుడిచిపెట్టేయాలనుకున్నాడు. అలాంటి వ్యక్తులు మన చరిత్రలో భాగంగా ఉంటే అంతకు మించిన విచారం మరొకటి ఉండదు. మేము ఈ  చరిత్రను మార్చేస్తాం..:” అని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు.

Image result for tajmahal

          అంతటితో ఆగని సంగీత్ సోమ్.. దేశానికే ఈ కట్టడం కళంకం అన్నారు. దీన్ని దేశద్రోహులు నిర్మించారని మండిపడ్డారు. సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ .. సంగీత్ సోమ్ పై మండిపడ్డారు. అవి దేశద్రోహులు నిర్మించిన కట్టడాలైతే ఎర్రకోటపై జెండా ఎందుకు ఎగరేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని ఇతర ప్రధాన సమస్యలను తప్పుదారి పట్టించేందుకు.. ఇలాంటి పనికిమాలిన ఎత్తుగడలు వేయడం సరకాదని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: