ఓ వైపు పార్టీ ఫిరాయింపులు.. మరోవైపు నేతల మధ్య విభేదాలు.. పార్టీని ఎటు వైపు తీసుకెళ్తున్నాయో అర్ధం కాని పరిస్ధితులు వైసీపీలో నెలకొన్నాయి. అధినేత జగన్ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తుంటే నేతలు మాత్రం తమ దారి తాము చూసుకుంటూ కార్యకర్తల్లో గందరగోళం స్పష్టిస్తున్నారు. అసలు వైసీపీకి ఏమైంది..?

Image result for ycp leaders

గడపగడపకు వైసీపీ.. మీ కోసం వస్తున్నా అంటూ.. జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు దగ్గరకు క్యూ కడుతున్నారు.. పార్టీ బలాన్ని తెలియజేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు పసుపు కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకోగా తాజాగా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక కూడా టీడీపీ  గూటికి చేరారు. తనతో పాటు మరికొందరు ముఖ్యనేతలను కూడా తీసుకుని వెళ్లారు.. ఇక ఇదే సమయంలో మరో  10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Image result for ycp leaders

ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్ధితి ఇలా ఉంటే తాజా మాజీలు, 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వారి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి పెద్ద శాపంగా మారుతోంది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి వర్గీయులు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతను కావాలనే పక్కన పెడుతున్నారంటూ పార్టీ  కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. ఇప్పటికే పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతికి, ధర్మాన ప్రసాదరావుకు మధ్య పొగసడం లేదనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న కోలగొట్లకు, సీనియర్ నేత బొత్సకు మధ్య ఆధిప్యత పోరు నడుస్తోంది. ఈ కారణంగానే తనకు అప్పగించిన నియోజకవర్గ సమన్వయకర్త పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. ఇక విశాఖలోనూ జిల్లా అధ్యక్షుడు గుడివాడ్ అమర్ నాథ్ తో పాటు విశాఖ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణను తప్పించేందుకు ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Image result for ycp leaders

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇదే తరహా ఆధిపత్య పోరు నడుస్తోంది.  పార్టీకి పూర్తి స్ధాయిలో పట్టున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో కూడా విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు పార్టీ మారుతారన్నది కార్యకర్తలకు కూడా తెలియడం లేదు.

Image result for ycp leaders

నేతల తీరు ఇలా ఉంటే జగన్ కోటరీలోని ముఖ్యుల మధ్య కూడా ఆధిపత్య పోరు తారాస్ధాయికి చేరిందనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. జగన్ టీంలో అత్యంత ముఖ్యులైన వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు పార్టీలోని వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సమయంలో విజయసాయిరెడ్డితో సీనియర్ బొత్స సత్యనారాయణకు పడటం లేదని కూడా తెలుస్తోంది. ఇక కీలక నేతలుగా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు.

Image result for ycp leaders

పార్టీలో ఈ స్ధాయిలో గందరగోళం నెలకొన్నా జగన్ తనపని తాను చేసుకుపోవడంపై రాజకీయ విశ్లేషకులతో పాటు సీనియర్ నేతలను విస్మయానికి గురి చేస్తోంది. పార్టీ మారుతున్నవారిలో అధిక శాతం ఆర్ధిక ప్రయోజనాలు ఆశించినా ... ఆ ప్రభావం పార్టీపై పడటం ఖాయమంటూ జగన్ కు సూచిస్తున్నారు. అయితే ఇవేమి పట్టించుకోని జగన్ పాదయాత్ర రూట్ షెడ్యూల్, ఎన్నికల మేనిఫేస్టో తయారీపై నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో పార్టీపై అపనమ్మకం ఏర్పడకుండా ఉండేందుకు లౌక్యంగా ఉండాలంటూ పలువురు జగన్ కు స్వయంగా సలహాలు కూడా ఇస్తున్నారని సమాచారం. మరి జగన్ ఏం చేస్తారో...!?


మరింత సమాచారం తెలుసుకోండి: