తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్. మంగ‌ళ‌వారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. న‌వంబ‌ర్ రెండో వారంలో రాహుల్ స‌మ‌క్షంలో రేవంత్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని ముహుర్తం కూడా ఫిక్స‌యినట్టు వార్తలొచ్చాయి. అయితే.. తన‌పై వ‌స్తున్న ఊహాగానాల‌పై రేవంత్ క్లారిటీ ఇచ్చారు. తాను ఢిల్లీకి టీఆర్ఎస్ పార్టీపై కేసులు వేసేందుకు న్యాయ‌వాదుల‌తో మాట్ల‌డడానికి వచ్చానన్నారు.

Image result for REVANTH REDDY

అయితే తాను గ‌తంలో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్ద‌ల‌ను కలిసిన‌ట్లు చెప్పుకొచ్చారు. మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో సైతం త‌న‌తో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం సంప్ర‌దింపులు జ‌రిపింద‌న్నారు. తాను పార్టీ మార‌కుండా ఉండాలంటే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా...? ఉండ‌దా...? అనేది స్ప‌ష్టం చేయాల‌ని చంద్ర‌బాబును కోరారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉన్న‌ట్లయితే తన దారి తాను చూసుకుంటాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ తో పొత్తు లేకున్నా తాను టిడిపిలో కొన‌సాగాలంటే కాంగ్రెస్ తో పొత్తుకు అధినాయ‌క‌త్వం ఓప్పుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

Image result for REVANTH REDDY

ఏపీలో టిడిపితో పొత్తు, తెలంగాణ‌లో ఒంట‌రి పోరు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో క‌మ్యూనిస్టులు ప‌శ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు... కేర‌ళ‌లో విరోధులుగా లేరా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. జాతీయ పార్టీల‌కే సిద్దాంతాలు లేన‌ప్పుడు టిడిపికి మాత్రం ఎందుకంటున్నారు రేవంత్. 1996లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో టిడిపికి చెందిన ఎర్ర‌న్నాయుడు, వేణుగోపాల చారి మంత్రులుగా ఉండటాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి అప్పుడు లేని ఆభ్యంత‌రం ఇప్పుడెందుక‌ని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ తో పొత్తుకు సంబంధించి టీటీడీపీ సీనియ‌ర్లు మాట్లాడుతుంటే షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని మోత్కుప‌ల్లిని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్య‌నించారు.

Image result for REVANTH REDDY

తాను పార్టీ మారేలా ఏపీ టీడీపీ నేత‌లు వ్య‌వ‌హారిస్తున్నార‌ని ఆరోపించారు రేవంత్. ప‌రిటాల శ్రీ‌రామ్ పెళ్లిలో కేసీఆర్ కు ఏపి మంత్రులు ఇచ్చిన ప్రాధాన్య‌త‌పై అవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో కేసీఆర్ తో ఫైట్ చేస్తుంటే ఏపీ టీడీపీ నేత‌లు ఆయ‌నకు ఇస్తున్న ప్రయారిటి ఇక్కడి కేడ‌ర్ కు ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. య‌న‌మ‌ల‌, ప‌య్యావుల లాంటి వాళ్లు తెలంగాణ ప్ర‌భుత్వంలో కాంట్రాక్ట్ లు చేసుకుంటూ ఎలాంటి సంకేతాలు తెలంగాణ నేత‌ల‌కు ఇస్తున్నార‌ని ప్రశ్నించారు.

Image result for REVANTH REDDY

రేవంత్ వ్యాఖ్యలపై తెలుగురాష్ట్రాల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ తీరుపై ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్న నేపధ్యంలో కావాలనే రాష్ట్రంలోని  మంత్రులపై  రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.. రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. యనమలకు, కేసీఆర్ కు మధ్య సంబంధాలపై రేవంత్ వ్యాఖ్యలు పూర్తి అవాస్తవమన్నారు రాజప్ప.

Image result for REVANTH REDDY

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికల్లో పొత్తుల పై పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ మహానాడులో క్లారిటీ ఇచ్చారని చెప్పారు. పార్టీకి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పార్టీ వేదికపై చర్చించుకోవాలని.. బహిరంగ విమర్శలు సరికాదన్నారు. టిడిపి బడుగుబలహీన వర్గాలకు చెందిన పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్నో గెలుపు ఓటములను చూసిందని.. తాజా పరిణామాలపై కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు.

Image result for REVANTH REDDY

పార్టీ వీడతారనే అంశంపై రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తుచేశారు. టీడీపీ ఎప్పుడూ వ్యక్తులపై ఆధారపడబోదని అన్నారు. రేవంత్‌ పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మొత్త‌మ్మీద తన భవిష్యత్తు విషయంలో రేవంత్ రెడ్డి బంతిని.. చంద్ర‌బాబు కోర్టులోకి నెట్టారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: