ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం నిర్వహించిన శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు ఉభయ సభల్లో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తొలిసారి సమావేశాలు జరగనున్నాయి.  అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ సభ్యులతోనే సభ నడవనుంది.

శాసనసభలో ప్రాధాన్యతాంశాలపై చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మొదటి రోజు పట్టిసీమపై చర్చిద్దామన్నారు. మనలో మనల్ని పొగుడుకోవడం, సభకు రాని ప్రతిపక్ష సభ్యులపై విమర్శలు చేయడం వంటివి చేయొద్దని పార్టీ సభ్యలకు వెల్లడించారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రధాన ప్రతిపక్షం ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం, శాసనసభను బహిష్కరించడం ఎప్పుడూ చూడలేదని అన్నారు.

విపక్షమే లేని అసెంబ్లీని చూడటం ఇదే మొదటిసారని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో అధికార, విపక్షాల పాత్రను టీడీపీనే పోషించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగానూ వ్యహరించాలని.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండి కూడా అధికారపక్షమే ప్రతి పక్షం పాత్ర పోషించటమనేది నిజానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చెయ్యడం ప్రభుత్వం విశ్వసనీయతని దెబ్బతీస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: