రాయలసీమ అంటే ఫ్యాక్షన్.. కరవు కాటకాలు.. కొన్నాళ్ల వరకూ అందరికీ గుర్తొచ్చేవే ఇవే.. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. అనంతపురం జిల్లాలో కియా కంపెనీ రాకతో రాయలసీమలో పారిశ్రామికాభివృద్దికి బీజం పడినట్టయింది. ఇప్పుడు మరిన్ని కొరియా కంపెనీలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొరియాలోని బుసాన్ నగరం తరహాలో సీమలో పారిశ్రామిక నగరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.


లేటెస్టుగా ఏపీ ఎక‌న‌మిక్ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొరియ‌న్ కాన్సులేట్ బృందం టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ‌ను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిసింది. కొరియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ హుంగ్ తాయ్ కిమ్ హుంగ్ తాయ్ తో పాటు కొరియన్ డిప్యూటీ కాన్సులేట్ చుంగ్ దాయ్ త‌మ స‌హ‌ధ‌ర్మచారిణిల‌తో పాటు అఖిల ప్రియ‌ను క‌లిశారు. 


కొరియ‌న్ బృందానికి టూరిజం మంత్రి హార్దిక స్వాగ‌తం ప‌లికారు. త‌మ దేశానికి చెందిన కొరియ‌న్ టూరిజం సంస్థ ఢిల్లీలో ఉంద‌ని, త‌ర్వలో దీని శాఖ‌ను గుంటూరులో ప్రారంభిస్తున్నామ‌న్నారు. ద‌శాబ్దాల క్రితం కొరియన్ రాజు హు భార‌త‌దేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం ప‌ర్యటించార‌ని కొరియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ వివ‌రించారు.


సీమలో పెట్టుబడుల కోసం కొరియా కంపెనీలు కూడా ఉత్సాహం చూపుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన‌తికాలంలోనే అంత‌ర్జాతీయ స్థాయిలో టూరిస్ట్ ల‌ను ఆక‌ర్షిస్తోంద‌ని కొరియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ హుంగ్ తాయ్ కిమ్ అన్నారు. కొరియా దేశానికి, ఆంధ్ర ప్రదేశ్ కు అనాదిగా అవినాభావ సంబంధాలున్నాయ‌ని, త్వర‌లో న‌వ్యాంధ్రకు కొరియ‌న్ల ప‌ర్యాట‌క బృందాలు వెల్లువెత్తుతాయ‌ని ఆయన అన్నారు. కొరియా దేశ‌స్తులు ఎక్కువ‌గా చైనాకు వెళుతుంటార‌ని, ఇపుడు వారి దిశ ఏపీ వైపు మారుతుంద‌ని చెప్పారు.


అయిదో వంతు కొరియ‌న్లు బౌద్ధమ‌త‌స్థుల‌ని, న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి సంద‌ర్శన‌కు వారంతా ఆస‌క్తిగా ఉన్నార‌న్నారు. ఏపీలో ప‌ర్యాట‌క ప్రాంతాలు ఎన్నో ఉన్నాయ‌ని, బుద్ధుడు న‌డ‌యాడిన ఈ ప్రాంతానికి కొరియ‌న్ ప‌ర్యాట‌కుల‌కు మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామ‌ని మంత్రి అఖిల ప్రియ చెప్పారు. తెలుగు భాష‌, సంస్కృతి గొప్పద‌నాన్నికొరియ‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కు వివ‌రించారు. కొరియన్ కంపెనీలన్నీ కొలువుదీరితే.. పారిశ్రామికంగా ఏపీ దూసుకుపోతుందడనంలో ఏమాత్రం సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: