ఒక్కసారి ఆలోచించండి..ఇప్పటిదాకా దశాబ్ధాల తరబడి మీరు బతుకుతున్న ఊరు మీది కాదు. అలా అని భయపడకండి..మీ భద్రత కోసం ప్రభుత్వం చట్టం చేస్తుంది. రాజస్థాన్ నుంచి మార్వాడీలు దేశం నలుమూలలా పాతుకుపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎక్కడా వారి భద్రతకు చట్టం అవసరం కాలేదు.

గుజరాతీలు వాడ వాడలా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. వారికీ చట్టం అండ అవసరం లేకపోయింది. ఆఖరికి విదేశీయులెందరొ మన రాష్ట్రంలో చదువుతున్నారు. వారికీ ఏ సమస్యాలేదు. కానీ తెలుగునేలపై పుట్టి, రాజధానిలో అవకాశాలున్న పాపానికి, అక్కడ చేరిన నేరానికి తెలుగుజనాలకు మాత్రం రక్షణ చట్టం కావాల్సి వచ్చింది. పరోక్షంగా వీరు సీమాంధ్రులు అనే ముద్రను ముఖాన వేసుకోవాల్సి వస్తోంది..ఈ చట్టం పుణ్యమా అని.

హతవిధీ..చట్టం చేయకపోయినా ఫరవాలేదు. పక్కవాడికి, మాకు మధ్య గోడలు కట్టకండి అని వేడుకోవాలనిపిస్తోంది. పుట్టి పెరిగిన గడ్డపైనే, వీరు పరాయి ప్రాంతీయులు అనే పచ్చబొట్టు పొడిపించుకుని బతకాల్సి వస్తోంది. ఇంతవరకు ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఎక్కడా ఈ తరహా చట్టం చేయలేదు. అంతవరకు అక్కడున్నవారి నందరినీ ఆ రాష్ట్ర ప్రజలుగానే గుర్తించారు. అంతేకానీ ప్రదేశాలు విభజించినట్లు ప్రజల్నీ విభజించలేదు. అంతెందుకు మద్రాసు నుంచి ఆంధ్రులు విడిపోయినపుడు సైతం,

ఆ పట్టణంలో వున్నవారు అలాగే హాయిగా వున్నారు. నేటికీ వుంటున్నారు వున్నారు. అక్కడ తెలుగు సంఘాలు అలాగే వున్నాయి. మరి ఈ తెగులు తెలుగునేలకే ఎందుకు? తెలంగాణా ఇచ్చిన నాటికి హైదరాబాద్ లో వున్నవారంతా, హైదరబాదీలే..లేదంటే తెలంగాణా ప్రజలే. అలా కలిపి వుంచే భావన పెంచకుండా, అడ్డుగోడ కట్టే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారు?

సరే, రక్షణ కోసం చట్టాలు చేస్తారనుకుందాం..భవిష్యత్ లో ఈ చట్టాన్ని తోసిరాజని, సెటిలర్స్ హటావొ అనే ఉద్యమం ఫుట్టదన్న నమ్మకం వుందా? చట్టాలు సమర్థవంతంగా అమలు అవుతాయన్న నమ్మకం వుందా? అలా అమలు అయివుంటే ఇప్పుడు తెలంగాణా ఉద్యమమే ఉద్బవించేది కాదు కదా?. అప్పుడు చేసిన ముల్కీనిబందనలు, సిక్స్ పాయింట్ ఫార్మూలా వంటివాటిని సమర్థవంతంగా అమలు చేస్థే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా.. అలాంటప్పుడు ఇప్పడు చేస్థున్న చట్టాలు కూడా అమలవుతాయన్న గ్యారంటీ ఏంటి ?

పైగా ఎవరైనా మరో ఇల్లు చూసుకుని, అక్కడ సదుపాయాలు చూసిన తరువాత మారాలనుకుంటారు. కానీ సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ అవేమీ చెప్పకుండానే, చూడకుండానే ముందుగానే ఇల్లు ఖాళీ చేయమంటోంది. ఛట్టాలు చేయలేదు, నిబంధనలు రూపొందలేదు, ఏవీ లేకుండానే ఆదీ ముందుగా తీర్మానం అంటున్నారు. ఇదెక్కడి చోద్యం?

మరింత సమాచారం తెలుసుకోండి: