నిన్నటి వరకు వైజాగ్ లో ఎలియన్ పక్షులు ప్రత్యక్షం అయ్యాయని..భూమిపై ఎలియన్స్ సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు ఊదరగొట్టాయి.   విశాఖలోని పాతనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఒడిశా స్టీవ్‌ డోర్స్‌ కంపెనీ మూడో అంతస్తు బాత్‌రూంలో ఉన్న ఆ పక్షులను అటవీ శాఖ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు గ్రహాంతర జీవులు కావని, ఇవి గుడ్లగూబ జాతికి చెందినవని అటవీశాఖ సిబ్బంది నిర్ధారించారు.

ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి అడుగున్నర ఎత్తు ఉన్నాయి.  వీటిని ఇంగ్లిష్ లో బార్న్ ఔల్స్ అంటారని, వాటి సాంకేతిక నామం టైటో ఆల్బా అని, తెలుగులో జీలుగు పక్షులని వారు వెల్లడించారు. ఇవి పుట్టిన కొద్ది రోజులవరకు వెంట్రుకలు మొలవవని, దీంతో ఇవి చిత్రంగా కనిపిస్తాయని వారు వెల్లడించారు. ఇవి పూర్తిగా నిశాచర జీవులని వారు తెలిపారు. రాత్రిపూట ఇవి స్పష్టంగా చూడగలవని, ఎలుకలు, పందికొక్కులను ఆహారంగా తీసుకుంటాయని అన్నారు. పట్నవాసులకు అవేంటో తెలియదని, వాటిని జీలుగు పక్షులంటారని, అటవీ ప్రాంతాల్లో అవి కనిపిస్తాయని వారు వెల్లడించారు. 

వాటిని ఇబ్బంది పెట్టడం వల్ల మృతిచెందే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, వాటిని ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల (జూ) అధికారులు తీసుకెళ్లారు. వారిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటి తల్లి ఆహారం తెచ్చి పెడుతోందని, వాటిని తీసుకెళ్లడం వల్ల పిల్లలు మృతిచెందే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: