కాకినాడ వైసీపీలో చిచ్చు రేగింది. పార్టీ బలోపేతం చేయడానికి ఆ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసింది. కార్పొరేషన్ లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీకి పులిమీద పుట్రలా మారింది ద్వారంపూడి, ముత్తా వర్గాల గొడవ. న‌గ‌ర‌పార్టీ అధ్యక్షుడి నియామం స్థానిక నేతల్లో చిచ్చురేపింది. నగర అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి దూర ప్రాంతాల నేతలొచ్చినా...స్థానికంగా కార్పొరేటర్ల గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. కాకినాడ న‌గ‌ర వైసీపీలో వర్గపోరు తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి తలనొప్పిగా మారింది. కాకినాడ నగర వైసీపీ అధ్యక్షుడు కంప‌ర ర‌మేష్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో జరిగిన పరిణామాలు ఇంటాబయటా చర్చనీయాంశమయ్యాయి.


కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత‌ పార్టీని బ‌లోపేతం చేసేందుకు అధినాయకత్వం ర‌మేష్‌ని న‌గ‌ర పార్టీ అధ్యక్షునిగా ప్రకటించింది. దీన్ని కొందరు నాయకులు వ్యతిరేకించారు. అయినా పట్టించుకోని హైకమాండ్ రమేష్ వైపే మొగ్గు చూపింది. దీంతో కాకినాడ వైసీపీలో కాక రేగింది.కొంత‌కాలంగా ముత్తా వర్సెస్‌ ద్వార‌ంపూడిగా అంతర్గత పోరు సాగుతోంది. న‌గ‌ర‌పార్టీ అధ్యక్షుడి నియామ‌కంతో అది మరింత ముదిరింది. ర‌మేష్ నగర వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ద్వార‌ంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ‌ర్గానికి చెందిన కార్పొరేటర్లెవరూ హాజ‌రుకాలేదట‌.


ధ‌ర్మాన ప్రసాద‌రావు, బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లాంటి సీనియర్‌ నాయకులు హాజ‌రైనా...కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం వహించే పార్టీ కార్పొరేటర్లు ప్రోగ్రాంకి దూరంగా ఉండటంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.కంప‌ర ర‌మేష్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రుస్తూ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఉన్న కార్పొరేటర్ల ఫొటోలకు కొందరు నల్లరంగు పూయటంతో ఇన్నాళ్లూ లోలోపల ఉన్న విభేదాలు వీధిన పడ్డట్లయింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి తనయుడు ముత్తా శశిధర్ వర్గానికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మరోసారి బయటపడింది.


నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి పాలైందని అధినాయకత్వానికి తెలిసి కూడా ...స‌యోధ్య కుద‌ర్చకుండా ముత్తా శ‌శిధ‌ర్ వ‌ర్గానికి చెందిన ర‌మేష్‌ని నగరపార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని ద్వారంపూడి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కాకినాడ న‌గ‌ర‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రూటి కుమార్‌ని తప్పించి ఆయన భార్యని  కౌన్సిల్ విప‌క్ష నేత‌ని చేసిన పార్టీ నాయకత్వం..ఇటీవ‌ల కార్పొరేటర్‌గా గెలిచిన కంప‌ర ర‌మేష్‌కి నగర బాధ్యతలు ఇవ్వడాన్ని ద్వారంపూడి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. రెండువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బొత్స, ధర్మాన ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటున్నారు.


ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వన్నట్లు ద్వార‌ంపూడి, ముత్తా వర్గాల మధ్య ఆధిపత్యపోరును కట్టడి చేయాల్సిన అధినాయకత్వం.. వారి మధ్య ఇంకాస్త చిచ్చుపెట్టిందని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన త‌రువాత కూడా పార్టీ నేతల్ని ఏకతాటిపైకి తేలేకపోవడం అధినాయకత్వం వైఫల్యమేనని కేడర్‌ భావిస్తోంది. ఎన్నికలకు సిద్ధపడాల్సిన సమయంలో నేతల మధ్య పార్టీ పెద్దలు సయోధ్య కుదర్చకుంటే..రానున్న రోజుల్లో పార్టీ బలహీనపడుతుందని కేడర్‌ టెన్షన్‌ పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: