కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ సోమ‌వారం సాయంత్రం కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై కూర్చోనున్నారు. ఈ పీఠంలో కొలువుదీర‌నున్న పిన్న‌వ‌య‌స్కునిగానే కాకుండా.. అవివాహితుడిగా కూడా రికార్డు సృష్టించ‌నున్నారు. రాజ‌కీయంగా త‌ల పండిన మేధావులు చేప‌ట్టిన ప‌ద‌వి నేడు రాహుల్‌కు సొంతం అవుతోంది.  ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాహుల్ నామినేషన్‌ దాఖలు చేశారు.మాజీ ప్రధాని మన్మోహాన్‌ సింగ్‌, పలువురు సీనియర్‌ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

 రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్‌ నేత మన్మోహాన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న పోలింగ్‌, 19న ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా పోటీ లేకపోవటంతో ఈ సాయంత్రమే రాహుల్‌ పేరును అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. నాలుగు సెట్ల రాహుల్‌ నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతలు సంతకాలు చేయగా.. రాహుల్‌ను ప్రతిపాదిస్తూ 93 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ త‌తంగం అంతా ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే.. రాహుల్‌ను జాతీయ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టిస్తారు.

Image result for rahul gandhi sonia

 దీంతో కాంగ్రెస్‌లో నూత‌న ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతు న్నారు. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ ప‌ద‌వీ కిరీటం.. రాహుల్‌కు ముళ్ల కిరీట‌మేన‌ని కూడా చెబుతున్నారు.  ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కేంద్రంగా బీజేపీ కూడా విస్తృతంగా విజృంభిస్తోంది. ఇదే క్ర‌మంలో గుజ‌రాత్ ఎన్నిక‌లు ఈ నెల‌లోనే జ‌ర‌గనున్నాయి. ఇటీవ‌ల ముగిసిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ బీజేపీ భారీ ఎత్తున విజ‌య‌బావుటా ఎగ‌రేసింది. 


దీంతో గుజ‌రాత్‌లో ఈ నెల‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు నువ్వా నేనా అనే రేంజ్‌లో జ‌ర‌గ‌నున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అదేవిధంగా 2019 ఎన్నిక‌లూ కాంగ్రెస్‌కు అతి పెద్ద స‌వాల్‌. ముఖ్యంగా రాహుల్‌కు అగ్ని ప‌రీక్ష‌. యూపీలో భారీ ఎత్తున ఎగురుతున్న కాషాయ జెండాను కింద‌కు దించ‌డం అంటే మాట‌లు కాదు. ఈ ఒక్క రాష్ట్రంలోనే 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు గెలుపొందిన పార్టీనే ఢిల్లీలో పాగా వేస్తుంద‌నేది రాజ‌కీయంగా ఉన్న సెంటిమెంట్‌. మ‌రి అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కుదేలైంది. ఇక‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఏపీల్లో ఒక్క తెలంగాణ‌లోనే ఆశించిన విధంగా ఉంది. ఇక్కడ ఒకింత ఫ‌ర్వాలేకున్నా.. ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ, త‌మిళ‌నాడులో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌డం అసాధ్యంగానే క‌నిపిస్తోంది.


ఇక‌, వ‌చ్చే జ‌న‌వ‌రిలో క‌ర్ణాట‌క‌లోనూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ  అధికారంలో ఉన్న కాంగ్రెస్ త‌దుప‌రి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువ‌గానే ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఇలాంటి ప‌రిణామాల‌ను రాహుల్ ఎలా ఎదుర్కొంటారు? ఎలా నెట్టుకొస్తారు?  కురువృద్ధుల‌తో నిండిపోయిన పార్టీలో యువ‌ర‌క్తాన్ని ఎలా ఎక్కిస్తారు?  2019లో మోడీ హ‌వాను ఎదిరి నిల‌బ‌డే అవ‌కాశం రాహుల్‌కు ఉందా? అనేవి ప్ర‌స్తుతానికి మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి. మ‌రి అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప‌.. రాహుల్ త‌న పార్టీని అధికారంలోకి తేవ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: