ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి తుళ్లూరు, ప‌రిస‌ర ప్రాంతాల్లోని సుమారు ముప్పై వేల ఎక‌రాలను ఎటువంటి గొడ‌వ‌లు, ఆందోళ‌న‌లు లేకుండా రైతుల నుంచి సేక‌రించిన వారిలో ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రావ‌ణ్‌కుమార్ పేరు తొలి వ‌రుస‌లో ఉంటుంది. ఇంత‌టి బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా నిర్వ‌హించ‌డంలో ఆయన పాత్ర ఎంతో కీల‌కంగా ఉంది. దేశ చ‌రిత్ర‌లోనే ఇటువంటిది లేద‌ని సీఎం చంద్ర‌బాబు కూడా పదేప‌దే చెబుతూ ఉంటారు. అంతేగాక శ్రావ‌ణ్ గురించి ఆయ‌న‌పై ఎంతో న‌మ్మ‌కం ఉండేది. కానీ ఇటీవ‌ల చంద్రబాబు.. శ్రావ‌ణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తాడికొండలో మ‌రో అభ్య‌ర్థిని రంగంలోకి దించాల‌ని భావిస్తుండ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నకు టికెట్ ద‌క్క‌డం కూడా క‌ష్ట‌మేనే చ‌ర్చ పార్టీ వర్గాల్లో మొద‌లైంది. 


రాజ‌ధానికి 30 వేల ఎక‌రాలు రైతుల నుంచి సేక‌రించడం.. అది కూడా ఎటువంటి ఉద్రిక్త‌త‌లు లేకుండా.. ఇది దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి అని చంద్ర‌బాబు ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. మరి ఆ ప్రాంత రైతులకు చంద్ర‌బాబుతోపాటు ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రావ‌ణ్‌క‌మార్‌పై ఎంతో న‌మ్మ‌కం ఉండాలి. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎక్కువ మార్కులు కొట్టేశారు శ్రావ‌ణ్‌! నిత్యం రైతుల‌తో స‌మావేశాలు ఏర్పాటుచేసి.. భరోసా క‌ల్పించారు. కొన్ని చోట్ల నిరస‌న‌లు ఎదురైనా వాటిని సామ‌రస్యంగా ప‌రిష్క‌రించి వారిని ఒప్పించేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు వచ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌డ‌మే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 


ఎస్సీ వ‌ర్గానికి చెందిన శ్ర‌వ‌ణ్ కుమార్ గుంటూరు జిల్లా తాడికొండ నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మొద‌ట్లో బాగానే ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయ‌న శైలి చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మారిపోయింది. రాజ‌ధాని భూ సేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌క్కువ ధ‌ర‌ల‌కే రైతుల నుంచి భూములు కొట్టేశార‌నే ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికీ చేస్తూనే ఉన్నారు. వీటికి స‌రైన స‌మాధానాలు చెప్ప‌డంలో శ్రావ‌ణ్ వెనుక‌బ‌డ్డారు. ఇక రైతుల ముసుగులో వైసీపీ నేత‌లు చేసిన‌ట్టు భావిస్తున్న ధ‌ర్నాలు, రాస్తారోకోలను కూడా ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లే వ‌ర‌కు  స్పందించ‌లేదు. దీంతో వ‌రుస పెట్టి మైన‌స్‌ల‌ను కూడ‌గ‌ట్టుకున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సి ఉన్నా.. మ‌న‌కెందుకులే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ట‌. 


దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు, ఇటీవ‌ల శ్ర‌వ‌ణ్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. 2014లో త‌న గెలుపున‌కు కార‌ణ‌మైన టీడీపీ స్థానిక నేత‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తు న్నాయి. దీంతో  శ్రావ‌ణ్ ప‌రిస్థితి ఓడ దాటే వ‌ర‌కు ఓడ‌మ‌ల్ల‌న్న‌.. ఓడ‌దాటాక బోడి మ‌ల్ల‌న్న టైపులో మారిపోయింద‌ని కార్య‌క‌ర్త‌లే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా పుష్ప‌రాజ్‌ను చంద్ర‌బాబు రంగంలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ పేరు కూడా వినిపిస్తోంది. మ‌రి టికెట్ ఖాయ‌మ‌నుకునే స్థాయి నుంచి టికెట్ ద‌క్క‌దేమో అనే స్థాయికి చేరుకుని ఇబ్బందులు ప‌డుతున్నారు శ్రావ‌ణ్‌!! 


మరింత సమాచారం తెలుసుకోండి: