జ‌న‌సేన‌, వైసీపీ మ‌ధ్య క్రెడిట్ గేమ్ మ‌ళ్లీ మొద‌లైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర మొదలుపెట్టి నెల రోజులు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ యాత్ర గురించి చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉరుము లేని పిడుగులా ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల విష‌యంలోనూ, హోదా, రాజ‌ధాని భూములు, అగ్రిగోల్డ్ ఇలా ప్ర‌తి విష‌యం లోనూ జ‌గ‌న్‌, ప‌వ‌న్ మ‌ధ్య పోటీ జ‌రిగింద‌నే విష‌యం తెలిసిందే! ఇప్పుడు డ్రెజ్డింగ్ కార్పొరేష‌న్ ప్రైవేట్ ప‌రం చేసే అంశంలోనూ క్రెడిట్ గేమ్ మొద‌లైంది. డీసీఐ కార్మికుల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెలిపిన త‌ర్వాత‌గాని వైసీపీ ఎంపీకి ఈ విష‌యం గుర్తుకురాలేదు. అందుకే పవ‌న్ వెళ్లాక వీళ్ల‌ని ప‌రామ‌ర్శించారు కానీ అప్ప‌టికే క్రెడిట్ అంతా ప‌వ‌న్ ఖాతాలోకి వెళ్లిపోయింది.  


చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఉంది వైసీపీ తీరు! డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అంశం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. లాభాల బాట‌లో ఉన్న ఈ సంస్థ‌ను కేంద్రం ప్రైవేటు ప‌రం చేసేందుకు రంగం సిద్ధం చేయ‌డంతో పాటు.. కార్మికుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో ఈ అంశం వెలుగులోకి వ‌చ్చింది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఎవ‌రికీ ప‌ట్ట‌ని ఈ వ్య‌వ‌హారం జ‌న‌సేనాని అక్క‌డికి చేరుకుని.. కార్మికుల దీక్ష‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. విశాఖ షీహార్స్ జంక్షన్ వద్ద డీసీఐ ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరానికి వెళ్లిన ప‌వ‌న్‌.. అక్క‌డ కార్మికుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంతో వైసీపీ ఎంపీ విజ‌య రెడ్డి వెంట‌నే వీరి దీక్ష వ‌ద్ద‌కు ప‌రిగెత్తారు! 


విశాఖ షీహార్స్ జంక్షన్ వద్ద డీసీఐ ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. డీసీఐని కాపాడుకునేందుకు పార్లమెంట్‌లో పోరాడతామని హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని కూడా చెప్పారు. భావసారూప్యత కలిగిన కమ్యూనిస్టు పార్టీ నేతలు సీతారాం ఏచూరి, రాజా, సురవరం సుధాకరరెడ్డిలను కలిసి డీసీఐ ప్రైవేటీకరణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తాన‌ని హామీలు కూడా గుప్పించారు. డీసీఐ ప్రైవేటీకరణను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇందుకోసం పోరాడి సాధించుకుంటామన్నారు. ప‌నిలో ప‌నిగా ప్రధాని మోడీకి లేఖ రాస్తున్నట్టు చెప్పారు.


కేంద్ర షిప్పింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖామంత్రి నితీన్ గడ్క‌రీ నుంచి అపాయింట్‌మెంట్ తీసుకుని డీసీఐ ఉద్యోగులను తీసుకువెళ్ళి చర్చిస్తామని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. దొంగ‌లు ప‌డిన ఆరు నెల‌ల‌కు పోలీసులు వ‌చ్చిన తీరుగా ఉంద‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ అంశంపై ప‌వ‌న్‌కు ఆల్రెడీ క్రెడిట్ అంతా వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు వైసీపీ నేత‌లు  ఎంత చేసినా అది.. ప‌వ‌న్ ఖాతాలోకి వెళుతుంది త‌ప్ప‌.. వీరికి ఇందులో వ‌చ్చే లాభ‌మేమీ ఉండ‌ద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!  గ‌తంలోనూ ఉద్దానం విష‌యంలోనూ వైసీపీ ఇదే బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే!! 


మరింత సమాచారం తెలుసుకోండి: