తాను టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్ ర‌క్త‌మే ప్ర‌వ‌హిస్తోంద‌ని చెప్ప‌డంలో ఆయ‌న ఏమాత్రం వెనుకాడ‌రు! స్వ‌ప‌క్షంలోని స‌భ్యులు ఏదైనా విమ‌ర్శించినా.. విప‌క్ష స‌భ్యుల్లా వారిపై ఆయ‌న‌ ఎదురు దాడి చేస్తారు! త‌మ ప్రాంతానికి నీరిచ్చిన ముఖ్య‌మంత్రిని అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆకాశానికి ఎత్తేస్తారు!! తాను ప‌ట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని మంకు ప‌ట్టు ప‌ట్టి ప‌నులు చేయించుకోవ‌డంలో దిట్ట అయిన ఆయ‌నే ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి! రాయ‌ల‌సీమలో తెలుగుదేశం పార్టీకి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న వారిలో జేసీ సోద‌రులు ముందు వ‌రుస‌లో ఉంటారు. వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోమ‌ని చెప్పిన జేసీ సోద‌రులు.. వార‌సుల‌ను ఇప్ప‌టికే రంగంలోకి దించారు. అంతేగాక త‌మ ఫ్యామిలీకి గుంప‌గుత్త‌గా టికెట్లు కావాల‌ని సీఎం చంద్ర‌బాబు ముందు ప్ర‌తిపాద‌న కూడా పెట్టార‌ని తెలుస్తోంది!! 

Image result for tdp

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరింది. ఆ తర్వాత అధినేత చంద్రబాబు దగ్గర జేసీ ఫ్యామిలీకి మరింత ఆదరణ పెరిగింది. గత ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాలు గెల్చుకోవడంలో తమ పాత్ర కూడా ఉందనే విషయాన్ని చంద్రబాబు, లోకేశ్‌ గుర్తించేలా చేసుకున్నారు. అధిష్టానానికి విశ్వాసపాత్రంగా ఉంటూ వస్తున్నారు. త‌మ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతున్న చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. ఇదే స‌మ‌యంలో `మావాడు మావాడు` అంటూనే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇమేజ్‌ను సీమ జిల్లాల్లో డ్యామేజ్ చేస్తున్నారు జేసీ దివాక‌ర్ రెడ్డి. అటు స్వామి కార్యంతో పాటు స్వ‌కార్యం కూడా పూర్తిచేస్తున్నారు. 


అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్‌రెడ్డికి ఎదురే లేకుండా చేసుకున్నారు.! గురునాథరెడ్డి చేరిక మొదలుకొని.. చాగల్లుకు నీరు ఇచ్చే విషయం వరకు అన్నింటా తన మాటను నెగ్గించుకోగలిగారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయ‌బోన‌ని జేసీ ఎప్పుడో చెప్పేశారు! ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణిస్తే తన కుమారుడు జేసీ పవన్‌రెడ్డి అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ఇన్‌డైరెక్ట్‌గా తన మనసులోని కోరికను బ‌య‌ట‌పెట్టారు. అంతేకాకుండా మొత్తం జిల్లా బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకోవాలనుకుంటున్నారు. ఇక ఆయ‌న సోద‌రుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటరవుతున్నారు.


తాడిపత్రి అసెంబ్లీ నుంచి అస్మిత్‌ను బరిలో దింపే ఆలోచన చేస్తున్నారు. తమ్ముడు ప్రభాకర్‌రెడ్డిని గుంతకల్లు అభ్యర్థిగా పోటీ పెట్టాలనుకుంటున్నారు. దివాకర్‌రెడ్డి మాత్రం రాజ్యసభపై దృష్టి పెట్టార‌ని పార్టీలో చ‌ర్చ మొద‌లైంది . అనంతపురం జిల్లాలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్నది తెలుగుదేశంపార్టీ ఆలోచన! ఇందులో భాగంగానే రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనేది పార్టీ శ్రేణుల మాట! బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఏ మాత్రం తగ్గించుకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే వారందరిని చేర్చుకోవాలని అనుకుంటోంది. మొత్తానికి జిల్లాలోని కీల‌క స్థానాల‌న్నీ జేసీ చేతుల్లోకి వెళిపోతాయేమో వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: