వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారాన్ని ఎలాగైనా నిల‌బెట్టుకోవాల‌ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఒక‌ప‌క్క అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ప్రణాళిక‌లు సిద్ధం చేస్తూనే.. మ‌రోప‌క్క ప్ర‌తిప‌క్షాల‌కు ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెడుతున్నారు. ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రోప‌క్క కేసీఆర్‌కు ఇంటి పోరు ఎక్కువ‌వుతోంది. ముఖ్యంగా కారులో కుమ్ములాట‌లు మొద‌ల‌వు తున్నాయి. అంత‌ర్గ‌త పోరు తీవ్ర‌మ‌వుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో నాయ‌కులను ఎడాపెడా ఎక్కించేసుకు న్నారు. వ‌స్తామ‌న్న ప్ర‌తి ఒక్క‌రినీ చేర్చేసుకున్నారు. వీరిలో కొంత మంది నాయ‌కులు ఇప్పుడు ఏకులా వ‌చ్చి మేకులా మారు తున్నారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క యాగీ చేసుకుంటున్నారు. వీధుల‌కెక్కి పోరాటాల‌కు కూడా దిగుతున్నారు. 

Image result for trs\

కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్‌ జిల్లా పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది.  నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య కొంతకాలంగా వర్గపోరు కొనసాగు తోంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భూపతిరెడ్డి భావించారు. లాస్ట్‌మినిట్‌లో వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డికి టికెట్ దొరికింది. దీంతో భూప‌తిరెడ్డిని బుజ్జ‌గించేందుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. అయినా కూడా వీరిద్ధ‌రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. వీరి మ‌ధ్య స్థానికంగా కేబుల్ గొడ‌వ‌లు కూడా ఉన్నాయి. ఈ పంచాయతీ సీఎం కేసీఆర్‌ వరకూ వెళ్లింది. తీరుమారక పోతే కఠిన చర్యలు తప్పవని భూపతిరెడ్డిని కేసీఆర్‌ గట్టిగానే హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోలేదు. 

Image result for trs\

దీంతో నిజామాబాద్ జిల్లా పార్టీ నేత‌లు స‌మావేశ‌మై భూప‌తిరెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని తీర్మానించారు. ఆయ‌న ఇక కాంగ్రెస్‌లో చేర‌తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డితో స‌మ‌స్య తీరిపోయింద‌నుకుంటే ఇప్పుడు మ‌రొక‌టి మొద‌లైంది. గోషామహల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు.  ముఖేష్‌ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ హయాంలో వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది. 


తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, నగరానికి చెందిన ఒక పార్లమెంట్‌ సభ్యుడు ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు కేసీఆర్‌ వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. దీంతో ముఖేష్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖేష్ చేరిక‌ను మాత్రం స్తానిక టీఆర్ ఎస్ వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. అయినా కూడా  కేసీఆర్ ఆయ‌న‌ను చేర్చుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. మ‌రి రానున్న రోజుల్లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రిన్ని జ‌రుగుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కారులో ఇలా వివాదాలు ముద‌ర‌డం.. పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: