ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎక్క‌డైనా మ‌నం సామెత‌లో మూడు అడుగులు ముందుకు..ఆరు అడుగులు వెన‌క్కు అని చెపుతుంటాం. కానీ ఏపీ బీజేపీ విష‌యానికి వ‌స్తే మాత్రం పావు అడుగు ముందుకు..ప‌ది అడుగులు వెన‌క్కు అని చెప్పుకోవాల్సిందే. దీనికి తోడు పార్టీలో ఉన్న ప్రముఖ నాయ‌కుల‌నే వేళ్ల మీద లెక్క పెట్ట‌వ‌చ్చు. మ‌ళ్లీ వీళ్ల‌లో వీళ్ల‌కే ప‌ది గ్రూపులు ఉన్నాయి. ఇద్ద‌రు ఎంపీలు చెరో గ్రూపు. ఇక ఏపీ అసెంబ్లీలో ఉన్న న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు మంత్రుల‌ది చెరోదారి. ఇది రెండు మాట‌ల్లో చెప్పాలంటే ఏపీ బీజేపీ దుస్థితి.


ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ ఆకాశానికి ఎగురుతాన‌న్న చందంగా ఆ పార్టీ ఏపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. టీడీపీతో పొత్తు లేక‌పోతే ఏపీలో బీజేపీ అనే పార్టీ ఒక‌టి ఉంద‌న్న విష‌య‌మే ఎవ్వ‌రికి తెలియ‌దు. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ రోజు రోజుకు దీన‌స్థితికి వెళ్లిపోతోంది. ఆ పార్టీ ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు, అమ‌రావ‌తి నిర్మాణం ఇలా ఎన్నో హామీలు ఇచ్చి వాట‌న్నింటిని తుంగ‌లో తొక్కేసింది. దీంతో ఇప్పుడు ఏపీలో బీజేపీ పేరు చెపితే ఎవ‌రైనా స‌రే భ‌గ్గుమంటున్నారు.


గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను స‌మాధి చేసిన‌ట్టే ఏపీ ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని కూడా స‌మాధి చేయ‌డంలో ఎలాంటి డౌట్ లేద‌న్న‌ట్టుగా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీతో పూర్తి స్థాయిలో విభేదించలేని పరిస్థితి విడిపోయి బయటకు రాలేని దీనస్థితి లో కమలం కన్ఫ్యూజన్ లో ఉంది. టీడీపీని వ‌దిలేస్తే ఏపీ జ‌నాలు బీజేపీని వ‌దిలేస్తారు. అలాగని టీడీపీ కూడా బీజేపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి వెళ్లేందుకు ఆస‌క్తిగా లేదు. ఇక బీజేపీపై ఆ పార్టీ నాయ‌కుల‌పైనే న‌మ్మ‌కం లేదు. దీంతో ఓ ఎమ్మెల్యే అయితే పార్టీ పేరుతో కాకుండా సొంతంగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌న్న టాక్ ఆ పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. 


రాజమండ్రి సిటీ బీజేపీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పార్టీ పేరుతో జ‌నాల్లోకి వెళితే లాభం లేదని స్వయంగా సొంత కార్యక్రమాన్ని రూపొందించి మొదలు పెట్టేశారు. మీ ఇంటికే మీ ఎమ్యెల్యే అన్న టైటిల్ తో ప్రజల్లోకి వెళ్ళే షెడ్యూల్ నిత్యం పెట్టుకున్నారు. గ‌తంలో గుండె గుండెకు బీజేపీ అనే కార్య‌క్ర‌మం ప్ర‌క‌టించి జ‌నాల్లోకి వెళ్లినా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆయ‌న పార్టీపై న‌మ్మ‌కం లేక‌, మీ ఇంటికే మీ ఎమ్యెల్యే అన్న టైటిల్‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించుకున్నారు. ఇది ఆయ‌న ఒక్క‌డి బాధే కాదు. ఏపీలో అంద‌రి బీజేపీ నాయ‌కులదీ కూడా. రేపో మాపో ఏపీ బీజేపీలో మిగిలిన నాయ‌కుల్లో ఈ అసంతృప్త సెగ‌లు రేగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: